తేట తెల్లం తెలంగాణ మాగాణ సింగారం
గలగల వాగులు వంకల చెరువుల సందోహం
బతుకమ్మ బోనాలు దసర పండుగల కాలం
ఆసోయ్ దూలా అలై బలైల కోలాటం
ఊర్లు ఊర్లన్నీ సోపతుల సుట్టాల బలగం
మనసై పలకరించుకుంటే పావురమే జీవునం
జిందగీ చుట్టూ అల్లిబిల్లిగా అల్లుకున్న ఇమ్మతి
మనిషిని చూస్తేనే ఎలుగు రవ్వల దీపం పొడ
శాయ శాయ పెయ్యి నిగ నిగల మెరుపు
చెయ్యి కండలైతే శాగవారిన తుమ్మలు
ఇంతింత గవ్వలోలిగ కనుగుడ్లల్ల కాంతి
గుంగురు గుంఉరు తిరిగి జుంపాలు
సూస్తేనే రామసక్కదనమైన రూపం
వడి తిరిగిన కంకెడు కంకెడు మీసాలు
పటపట పండ్లు కొరికినట్టుగ తెల్లని దంతాలు
పెదవులకెల్లి రాలిపడే నవ్వుల నందివర్ధనాలు
గలగల గంట కొట్టినట్టు మాటల సందడి
సూస్తేనే వన్నె వన్నెల పడుసు పెడుసుదనం
ఉరికినట్టు నడిచే ఆ అరిపాదాల పరుగులు
రికాం లేని పనులకు చక చకా అరచేతులు
అరొక్క సార్గం అవలీలగా చేసే ధీమంతం
సూస్తేనే తెలుస్తది కైలి కోల్యాగ లెక్క బలం
మర్మం లేదు గర్వం లేదు ఉన్నది ఉన్నట్టే
సూటిగా బాణం కొట్టినట్టే కటాకట్ మాట
ఆగమాగం లేదు నిత్తే నిదానపు ముచ్చట
తప్పును తప్పని చెప్పే ఇమరశ తప్ష
సూస్తేనే ఎర్కైతది మనిషి ఎంత ధర్మతో
‘గిది గుర్రం గిది మైదానం’ పక్కా లెక్క
ఎటమటమైతే ఎంతటోడైనా గంతే అక్కా
అన్నాలం అగుపిస్తేనే కండ్లు చింత నిప్పులు
న్యాలంతా ఇయ్యర మయ్యర కొట్లాడిన గుణం
సలసల మరిగిన రగుతం మరకల జాడలు
ఏండ్లకు ఏండ్లుగ పోరు చేసిన బొడిగలు
ఇక్కడి నీళ్లలోనే కలెగలిసిన పోరాట జవ
ఇక్కడి గాలిలోనే ఆరాటాల కలవరింత
ఎల్లకాలమూ ఎదురు నడవడమే జీవితం
తేట తెల్లం తెలంగాణ వెలుగు లోకం
జిందగీల చుట్టూ అల్లుకున్న ఆచార వ్యవహారం
ముట్టుకుంటే పావురమే లేకుంటే పోరాటమే
నీలాకాశంలో రగ రగ ఎగురుతున్న పతాకం.
-అన్నవరం దేవేందర్
9440763479