మేడ్చల్, జనవరి 27(నమస్తే తెలంగాణ) : భూమిపై 45 ఏండ్లకుపైగా అన్ని హక్కులు, డిజిటల్ పాస్బుక్కులున్న పట్టాదారులకే అధికారులు నోటీసులు ఇవ్వడంపై మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బొమ్మరాసిపేట్ రైతులు మండిపడుతున్నారు. 1965లో విక్రయించిన భూములపై వారి వారసులు ఎలాంటి ఆధారాలు లేకుండా ఫిర్యాదు చేస్తే తమకు నోటీసులివ్వడాన్ని తప్పుబట్టారు.
మంగళవారం కీసర ఆర్డీవో రాజేశ్కుమార్ను కలిసి వినతిపత్రమిచ్చా రు. 1965లో మాజీ ఎంపీ బలరాం కృష్ణ య్య తన వెయ్యి ఎకరాలను విక్రయించగా అనేకమంది కొనుగోలు చేశారు. వారి నుంచి 323 సర్వేనంబర్ నుంచి 409 సర్వే నంబర్ వరకు 500మంది రైతులు కొనుగోలు చేశారు.
వాటికి సంబంధించి అన్ని పత్రాలతోపాటు డిజిటల్ పాసుపుస్తకాలు తమ పేరిటే ఉన్నాయని, ఇప్పుడు కొందరు బలరామ కృష్ణ య్య వారసులమని వచ్చి ఆ భూమిని విక్రయించలేదంటున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. నాడు సీలింగ్ చట్టం వచ్చినప్పుడు స్వయంగా బలరాం కృష్ణ య్య వారసులు తమకు ఈ సర్వే నంబర్లలో ఎలాంటి భూమి లేదని స్పష్టంచేసిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. ఇదే విషయమై గతం లో ఒకసారి అధికారులు రైతులకు నోటీసులు ఇచ్చినప్పుడు భూమి హక్కులపై ఆధారాలను సమర్పించినట్టు తెలిపారు.