చిన్నకోడూరు, జనవరి 27 : రంగనాయకసాగర్ కెనాల్‌కు నీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు చేపట్టిన ధర్నాకు దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. వెంటనే నీటిని విడుదల చేసింది. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు, సిద్దిపేట రూరల్, నారాయణరావుపేట మండలాలకు చెందిన రైతుల పక్షాన బీఆర్ఎస్ నాయకులు మంగళవారం చిన్నకోడూరు మండలం రంగనాయకసాగర్ ఇరిగేషన్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఇరిగేషన్ అధికారులు వెంటనే స్పందించి నీటిని విడుదల చేయడంతో రైతులు ధర్నా విరమించారు. తమ సమస్య పరిష్కారానికి చొరవ చూపిన బీఆర్ఎస్ పార్టీకి రుణపడి ఉంటామని రైతులు ముక్తకంఠంతో నినదించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. వరినాట్లు వేసుకునే సమయంలో చెరువులు, కుంటలు, కాలువలకు నీటిని విడుదల చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల శ్రేయస్సు కోసం రెండున్నర ఏండ్లలో ఏనాడూ ఆలోచించలేదని మండిపడ్డారు. నీటి విడుదల కోసం రైతులు ధర్నా చేస్తే తప్ప ప్రభుత్వానికి సోయి రాలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాట్లు మొదలు కాకముందే నియోజకవర్గంలోని అన్ని చెరువులు, కుంటలు నింపిన ఘనత కేసీఆర్, హరీశ్‌రావుకే దక్కిందని అన్నారు. రైతులను ఇబ్బందులు పెడితే బీఆర్ఎస్ రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు.