హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ) : మేడారం మహా జాతర జరిగే తేదీల్లోనే మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్లు స్వీకరించడం సరికాదని టీఎస్ జీసీసీ మాజీ చైర్మన్ అభిమాన్ గాంధీనాయక్ తెలిపారు. ప్రభుత్వ నిర్ణయం గిరిజనులపై చిన్నచూపేనని మంగళవారం ఒక ప్రకటనలో అభివర్ణించారు. రాష్ట్రంలో అతిపెద్ద గిరిజన మహా కుంభమేళా అయిన సమ్మక్క-సారలక్క జాతరకు దాదాపు ఐదు రాష్ర్టాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులే కాకుండా కులమతాలలకు అతీతంగా లక్షలాది మంది పిల్లాపాపలతో మేడారం చేరుకుంటారని పేర్కొన్నారు. జాతర జరిగే రోజుల్లోనే నామినేషన్లు వేసేలా ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేయడం తగదని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలంతా జాతరలో ఉంటే నామినేషన్లు ఎలా వేయగలరని, జాతర ముగిసిన తర్వాత షెడ్యూల్ విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.