నిరుపేదలకు భూములిచ్చింది నాడు ఇందిరమ్మ రాజ్యంలోనేనంటూ ఇప్పటికీ తాతల నాటి, తరాల నాటి ముచ్చట చెప్పుకునే కాంగ్రెస్ నాయకులు.. ఇప్పుడు చేస్తున్నదేంటి? పెద్దల కోసం, రియల్టీ దందా కోసం పేదలను తరిమి, వారి భూముల్ని గుంజుకుంటున్నది. నాలుగో నగరం కింద పడి నలుగుతున్న బతుకులెన్ని? వారి నుంచి లాక్కున్న భూములెన్ని? ఆరునెలల కాలంలో బడుగు బలహీనవర్గాల నుంచి నిర్దాక్షిణ్యంగా సర్కార్ గుంజుకున్న అసైన్డ్ భూమి 6,629 ఎకరాలు! నామమాత్రపు వెలకట్టి తీసుకున్నదే అదంతా! ఇదీ రేవంత్ సర్కార్ ఘనత! ఇదీ ఇప్పటి ఇందిరమ్మ రాజ్యం
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 11 (నమస్తే తెలంగాణ): ఒక చేత్తో ఇచ్చి.. మరో చేతితో తీసుకుంటే ఏమనాలి? అదీ ఓ నిరుపేద కుటుంబాలకు ఉన్న ఒకటి, రెండు ఎకరాల చొప్పున ఉన్న భూమిని బలవంతంగా గుంజుకుంటే ఏం చేయాలి? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే పని చేస్తున్నది. కాదు కాదు.. అదే పనిగా పెట్టుకొన్నది. ఇందిరమ్మ రాజ్యంలో భూమిలేని నిరుపేదలకు భూములు పంచాం.. అంటూ సర్కార్ పెద్దలు గొప్పలకు పోతుంటారు. కానీ ఇప్పుడే అదే ఇందిరమ్మ రాజ్యం పేరిట నిరుపేదలకు ఇచ్చిన భూమిని బలవంతంగా, నిర్దాక్షిణ్యంగా గుంజుకుంటున్నారు. నామమాత్రపు రేటు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు.
గత రెండేండ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు చూస్తుంటే.. ఫోర్త్ సిటీ పరిధిలో బడుగు, బలహీనవర్గాల చేతిలో అసలు భూమి ఉండొద్దనేలా వ్యవహరిస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గత ఆర్నెల్ల వ్యవధిలోనే 6,629 ఎకరాలకు పైగా కేవలం అసైన్డ్ భూములనే ప్రభుత్వం భూసేకరణ పేరిట తీసుకోవడం ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నది. ఈ భూములన్నీ అత్యధికంగా ఇందిరమ్మ హయాంలో భూమిలేని బడుగు, బలహీనవర్గాల కుటుంబాలకు ఇచ్చినవే కావడం గమనార్హం. ప్రత్యేకంగా ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (ఎఫ్సీడీఏ)ని ఏర్పాటుచేసిన సర్కార్.. దాని పరిధిలో ఎక్కడెక్కడ అసైన్డ్ భూములున్నాయో? వాటన్నింటినీ భూసేకరణ పేరిట స్వాధీనం చేసుకొంటున్నది. మున్ముందు సన్న, చిన్నకారు రైతుల అసైన్డ్ భూములనూ సేకరించేందుకు అధికారులు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నా రు. సమీప భవిష్యత్తులోనే ఎఫ్సీడీఏ పరిధిలో అసైన్డ్ భూమి లేకుండా తీసుకొని, భూ బ్యాంకును పెంచుకునేందుకు భారీ కుట్ర జరుగుతుండగా.. మరి ఈస్థాయిలో భూసేకరణ చేసి టీజీఐఐసీ ఖాతాలో వేస్తున్న ప్రభుత్వం ఏయే కంపెనీలకు ఎంత కేటాయిస్తుందనేది మాత్రం బయటకు పొక్కనీయడం లేదు.
ఫార్మా రైతులకు రేవంత్ సర్కార్ ధోకా
తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్ల పాటు ఆర్థికంగా, సామాజికంగా సంతోషంతో ఉన్న అన్నదాత గత రెండు సంవత్సరాలుగా కంటి మీద కునుకే లేకుండా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానంగా హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న రంగారెడ్డి, వికారాబాద్ వంటి జిల్లాల్లోని రైతుల పరిస్థితి క్షణమొక గండంలా తయారైంది. ఇందులో భాగంగా దశాబ్దాల కింద ట ఇందిరమ్మ హయాంలో భూములు పొందిన భూమిలేని నిరుపేద రైతులు.. రేవంత్ సర్కారు ఏక్షణంలో భూమి గుంజుకుంటుందో తెలియని అయోమయంలో పడిపోయారు. అధికారంలోకి వ చ్చేందుకు ఫార్మా సిటీ భూములను రైతులకు తిరిగి ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రె స్.. కుర్చీ ఎక్కగానే అదే ఫార్మా రైతులకు ధోకా చేసింది. కేసీఆర్ హయాంలో గ్రీన్ ఫార్మా సిటీ కోసం.. రైతులను ఒప్పించి.. సరైన పరిహారం ఇవ్వడంతోపాటు అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్లు, ఇంటికో ఉద్యోగం ప్రకటించి భూములను సేకరించింది. ఫార్మాసిటీ ఏర్పాటు చేయకపోతే రైతుల భూములను వాపసు ఇస్తామన్న షరతుతోనే భూములను తీసుకున్నది.
ఇచ్చిన మాట ప్రకారం ఫార్మా కంపెనీల ఏర్పాటుకు కసరత్తు కూడా మొదలుపెట్టింది. కానీ రేవంత్రెడ్డి ప్రభుత్వం హైకోర్టుకు ఫార్మా సిటీ ఉన్నదని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి వాస్తవికంలో మాత్రం అక్కడ ఫోర్త్ సిటీని ఏర్పాటు చేస్తానంటున్నది. మరి ఇంతటితో ఆగకుండా.. ఫోర్త్ సిటీ పరిధిలో బడుగు, బలహీనవర్గాల రైతుల చేతుల్లో ఉన్న అసైన్డ్ భూములపై కన్నేసింది. ఎడాపెడా నోటిఫికేషన్లు ఇస్తూ నే ఉన్నది. రైతుల నుంచి భూములను గుంజుకుంటూనే ఉన్నది. సాధారణంగా గ్రీన్ఫీల్డ్ రోడ్డు, రేడియల్ రోడ్డు ఇలా ప్రాజెక్టులను ప్రకటించి మరీ భూములను గుంజుకుంటున్నది. అందులో ప్రభుత్వ, ప్రైవేటు, అసైన్డ్ భూములు ఉంటున్నాయి. కానీ ప్రాజెక్టు పేరు చెప్పకుండా పారిశ్రామిక అవసరాలు అంటూ భూసేకరణ నోటిఫికేషన్లు ఇవ్వడం.. వేలాది ఎకరాలు సేకరించడం.. గత ఆరు నెలలుగా ప్రభుత్వం ఇదే పనిగా పెట్టుకున్నది.
భూమి ఉన్న సామాన్య రైతులు ఉండొద్దా?
ఫోర్త్ సిటీ పరిధిలోని అన్ని గ్రామాల్లో ఉన్న అసైన్డ్ భూముల జాబితాను ప్రభు త్వం తెప్పించుకొని దగ్గర ఉంచుకున్నది. ఒక్కొక్కటిగా భూసేకరణ పేరిట తీసుకుంటున్నది. ఇలా ఆరు నెలల వ్యవధిలోనే కందుకూరు, యాచారం మండలాల పరిధిలోని 8 గ్రామాల్లోని 6,629 ఎకరాల అసైన్డ్ భూములను నోటిఫికేషన్లు ఇచ్చి రైతుల నుంచి తీసుకున్నది. ఎకరా రూ.8 లక్షల చొప్పున పరిహారాన్ని మా త్రం ఇస్తున్నది. ఆదిలో భూములు ఇచ్చేందుకు రైతు లు నిరాకరించినా పోలీసుల బలగాలను మోహరించి బలవంతంగా తీసుకుంటున్నది. దీనికి తోడు అవి అసైన్డ్కావడంతో భూమి ఇచ్చేందుకు నిరాకరిస్తే పరిహారం ఇవ్వకుండానే తీసుకునే అధికారం ఉన్నదంటూ అధికారులు బెదిరింపులకు కూడా పాల్పడుతున్నట్టు బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ అసైన్డ్ భూములున్న గ్రామాల్లో పట్టా భూమి ధర ఎకరా రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు ధర పలుకుతుంది. అంటే అంతటి విలువైన ప్రాంతంలో బడుగు, బలహీనవర్గాల కు భూములు ఉండటం ప్రభుత్వానికి నచ్చడం లేదా? అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ భూములు ఎవరికిస్తరు?
సన్న, చిన్నకారు రైతుల నుంచి ప్రభుత్వం సేకరిస్తున్న భూములను టీజీఐఐసీ ఖాతాలో వేస్తున్నారు. నోటిఫికేషన్ ఇచ్చిందే తడవుగా రెవెన్యూ రికార్డుల్లో వెంటనే రైతుల పేర్లు పోయి టీజీఐఐసీ పేరిట భూములు నమోదవుతున్నాయి. ప్రస్తుతానికి ప్రభుత్వపరంగా ఎలాంటి అవసరాలు లేకున్నా పారిశ్రామిక అవసరాల పేరిట సేకరిస్తున్న ఈ భూములను ఏం చేయనున్నారనే దానిపైనే పలురకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో ప్రభుత్వ ప్రాజెక్టులు, అవసరాల కోసం అని కొందరు అధికారులు చెప్తుండగా, అందుకోసం ఇంత భారీస్థాయిలో భూములను సేకరించాల్సిన అవసరం లేదనే వాదనలు కూడా ఉన్నాయి. పారిశ్రామికాభివృద్ధి పేరిట ఈ భూములను ప్రైవేటు, కార్పొరేట్ కంపెనీలకు కేటాయిస్తారనే విమర్శలూ ఉన్నాయి. కానీ ఏ కంపెనీకి, ఎక్కడ? ఎన్ని ఎకరాలు? కేటాయిస్తారనే వివరాలను మాత్రం బయటికి పొక్కనీయడం లేదు. అది ప్రభుత్వ స్థాయిలో జరుగతున్న ప్రక్రియే తప్ప తమకు ఎలాంటి సమాచారం ఉండటం లేదని క్షేత్రస్థాయి అధికారులు చెప్తున్నారు. దీంతో అసలు ప్రభుత్వం ఈ భూములను ఇప్పటికే కేటాయింపులు జరిపిందా? లేదా? అనేది కూడా వెల్లడి కావడం లేదు.
