పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి పెనం మీదనుంచి పొయ్యిలోపడ్డ చందంగా తయారైంది.
ఇప్పటికే దేశాన్ని అక్కడ ఇక్కడ తెచ్చిన అప్పులతో నెట్టుకొస్తున్న పాక్ సర్కారుకు.. భారత్ నిర్ణయాలు శరాఘాతంలా మారాయి మరి.
సింధూ జలాల ఒప్పందం నిలిపివేత, వాఘా-అట్టారి మార్గం మూసివేత దాయాది దేశం సాగు-త్రాగునీటి అవసరాలను, వాణిజ్య సంబంధాలను గట్టిగానే దెబ్బతీస్తున్నాయి.
Pahalgam Attack | న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 : ‘కుక్క తోక వంకర’ అన్నట్టు పాక్ వక్రబుద్ధి మరోసారి బయటపడింది. 26 మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్న ముష్కరులు పొరుగు దేశం ప్రేరేపితులేనన్న వాస్తవాలు ఇప్పుడిప్పుడే ప్రపంచానికి తెలిసొస్తున్నాయి. నిజానికి పహల్గాం ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉన్నట్టు ముందు నుంచే అనుమానిస్తున్న భారత్.. అందుకు స్పష్టమైన ఆధారాలున్నాయని కూడా అంటున్నది. ఈ క్రమంలోనే దాయాది దేశాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టే చర్యలకు కేంద్ర ప్రభుత్వం దిగుతున్నది. ఇందులో భాగంగానే దశాబ్దాల చరిత్ర ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడమేగాక, ఎంతో కీలకమైన వాఘా-అట్టారి మార్గాన్ని కూడా మూసేసింది. ఈ రెండు నిర్ణయాలు పాక్ ఎకానమీని రిస్క్‌లో పడేస్తున్నాయిప్పుడు.
వాఘా-అట్టారి సరిహద్దు చెక్‌పోస్ట్ కేవలం మనుషుల రాకపోకలకేగాక.. భారత్-పాక్ మధ్య ఉన్న ఏకైక వ్యాపార, వాణిజ్య మార్గం. ఇప్పుడిది మూసుకుపోవడంతో ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యానికి బ్రేకులు పడ్డైట్టెంది. వాఘా-అట్టారి రోడ్డు మార్గం గుండానే ఆయా వస్తూత్పత్తులు దేశాలు మారుతున్నాయి. ఇక ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యంలో భారత్‌దే పైచేయి. పాకిస్థాన్ నుంచి దిగుమతి అవుతున్న వస్తూత్పత్తుల విలువ కంటే భారత్ నుంచి పాక్‌కు ఎగుమతి అవుతున్నవాటి విలువే ఎక్కువ. అయితే పాక్ కవ్వింపు చర్యల నడుమ 2019 నుంచే ఈ వాణిజ్యం తగ్గుముఖం పట్టింది. పుల్వామా ఉగ్రదాడితో పాక్ నుంచి వచ్చే దిగుమతులపై 200 శాతం సుంకాలు పడుతున్నాయి. ప్రస్తుత ఉద్రిక్తతల వల్ల పూర్తిగా ఆగిపోయినైట్టెంది. 2023-24లో ఈ మార్గం ద్వారా జరిగిన వాణిజ్యం విలువ రూ.3,886.53 కోట్లుగా ఉన్నది. మొత్తం వాణిజ్యం విలువ 1.3 బిలియన్ డాలర్లు. ఈ మార్గంలో 2018-19లో వాణిజ్యం రూ.4,370.78 కోట్లుగా ఉండటం గమనార్హం. మరోవైపు 1960లనాటి సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేశారు. గతంలో ఎన్నిసార్లు పాక్ దుశ్చర్యలకు పాల్పడినా.. కేంద్రం ఈ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈసారి ఆ నిర్ణయం తీసుకోవడం.. పెహల్గాం దాడిని కేంద్రం ఎంత తీవ్రంగా పరిగణిస్తున్నదోననడానికి నిదర్శనమని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక ఒప్పంద నిలుపుదల పాక్ వ్యవసాయ రంగాన్ని అత్యంతగా ప్రభావితం చేయనున్నది. తూర్పు నదులు సట్లేజ్, బీస్, రవీ భారత్‌కు, పశ్చిమ నదులు ఇండస్, జీలం, చినాబ్ పాకిస్థాన్‌కు దక్కాయి. అయితే ఎగువన ఉన్న భారత్ నుంచే ఇవన్నీ పాక్‌లోకి వెళ్తుండటంతో ఒప్పందం నిలిపివేత.. ఆయా నదులపై భారత్‌కున్న స్వేచ్ఛను ఒక్కసారిగా పెంచేసింది. ఫలితంగా ఆ జలాలను భారత్ తమ అవసరాలకు వాడుకుంటే పాక్ ఎండినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పాకిస్థాన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తకర పరిస్థితులు నెలకొనడంతో ఆ దేశ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. కేఎస్ఈ-100 సూచీ 2,206.33 పాయింట్లు కోల్పోయి 1,15,019.81 పాయింట్ల వద్ద ముగిసింది.
పాకిస్థాన్‌తో భారత్ వాణిజ్యం 2024-25 ఏప్రిల్-జనవరిలో 500 మిలియన్ డాలర్లుగా కూడా లేదు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో 800 బిలియన్ డాలర్లకుపైగానే ఉన్నది. ప్రస్తుత ఉద్రిక్తతల నడుమ వాఘా-అట్టారి చెక్‌పోస్ట్ మూసివేతతో ఈ వాణిజ్యం పూర్తిగా నిలిచిపోయింది. గడిచిన 10 నెలల్లో భారత్ నుంచి పాకిస్థాన్‌కు జరిగిన ఎగుమతుల్లో దాదాపు 60 శాతం ఆర్గానిక్ రసాయనాలు, ఔషధ ఉత్పత్తులే.