న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: పహల్గాం ఉగదాడి దరిమిలా సింధూ నదీ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేయాలని భారత్ తీసుకున్న నిర్ణయాన్ని జల యుద్ధంగా, చట్టవ్యతిరేక చర్యగా పాకిస్థాన్ అభివర్ణించింది. ఈ నిర్ణయాన్ని న్యాయపరంగా సవాలు చేస్తామని పాక్ ప్రకటించింది. ఒప్పందం ప్రకారం తమకు లభించే ప్రతి నీటి బొట్టు తమకే చెందుతుందని పాక్ స్పష్టం చేసింది.
భారత్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాన్ని జల యుద్ధ, పిరికిపంద, చట్ట వ్యతిరేక చర్యగా పాకిస్థాన్ ఇంధన శాఖ మంత్రి అవాయిస్ అఘారీ ఆరోపించారు. పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు హత్యచేసిన ఘటనకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ప్రకటించిన చర్యలను అంచనా వేసేందుకు పాకిస్థాన్‌కు చెందిన అత్యున్నత భద్రతా సంస్థ నేషనల్ సెక్యూరిటీ కమిటీ(ఎన్ఎస్సీ) సమావేశమైంది.
1960 దశకంలో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంలో కుదిరిన సింధూ జలాల ఒప్పందం ప్రకారం పాకిస్థాన్‌లో ప్రవేశించే సింధూ జలాలలో 80 శాతం ఎగువన ఉన్న దేశమైన భారత్ నుంచే అందుతున్నాయి. ఈ నీటి ఒప్పందాన్ని నిలిపివేయడం వల్ల పాకిస్థాన్‌కు చెందిన వ్యవసాయ రంగంపై దీని ప్రభావం తీవ్రంగా ఉండనుంది. ఉగ్రదాడికి సంబంధించి పాకిస్థాన్‌పై భారత్ చేసిన ఆరోపణలను నిరాధారంగా పాక్ విదేశాంగ మంత్రి ఇషాఖ్ దర్ తోసిపుచ్చినట్లు పాక్ మీడియా పేర్కొంది. తన స్వీయ వైఫల్యాలకు పాక్‌ను నిందించడానికి భారత్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. భారత్ ఒత్తిడి ఎత్తుగడలకు పాక్ లొంగబోదని రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ప్రకటించారు.