TUWJ | భూత్పూర్, ఏప్రిల్ 02 : జర్నలిస్టుల సంక్షేమమే టీయూడబ్ల్యూజే 143 సంఘం ప్రధాన ధ్యేయమని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ అన్నారు. ఇవాళ పట్టణ కేంద్రంలో ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జర్నలిస్టుల అభివృద్ధికి పాటుపడిన సంఘం టీయూడబ్ల్యూజే 143 అని అన్నారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 15 వేల అక్రెడిటేషన్లు ఉండేవి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం జర్నలిస్టులకు ప్రాధాన్యతను ఇవ్వాలని ఉద్దేశంతో అల్లం నారాయణ అప్పటి ముఖ్యమంత్రి కేసిఆర్‌తో మాట్లాడి 23 వేల అక్రిడేషన్లను మంజూరు చేశారు. ఇంత పెద్ద మొత్తంలో అక్రెడిటేషన్లు భారత దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేవని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలనే ఉద్దేశంతో రూ. 42 కోట్లతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేశారని తెలిపారు.
కరోనా సమయంలో కరోనా బారిన పడ్డ జర్నలిస్టులకు కొంత ఆర్థిక సాయం అందజేశారు. రాష్ట్రంలో జర్నలిస్టుల కోసం పనిచేస్తున్న సంఘాలలో టీయూడబ్ల్యూజే ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. అంతేకాకుండా జర్నలిస్టుల కోసం ప్రత్యేకంగా భవనాన్ని కేటాయించిన ప్రభుత్వం కూడా కేసీఆర్ దేనని తెలిపారు. టీయూడబ్ల్యూజే 143 సంఘం ఉద్యమం కోసం పుట్టిన సంఘం అని, ఉద్యమంలో ఎంతో కీలకంగా పనిచేసిన సంఘమని గుర్తింపు ఉందన్నారు. జర్నలిస్టులందరూ ఏకతాటిపైకి వచ్చి సంఘం అభివృద్ధి కోసం కృషి చేయాలని ఆయన సూచించారు.
అనంతరం జిల్లా టీయూడబ్ల్యూజే 143 అధ్యక్షుడు గోవర్ధన్ గౌడ్ సమక్షంలో నూతనంగా మండల కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. మండల టీయుడబ్ల్యూజే -143 సంఘం అధ్యక్షునిగా ఆర్.యాదగిరి(నమస్తే తెలంగాణ), గౌరవ అధ్యక్షునిగా వెంకటేశ్వరరావు (సాక్షి), ఉపాధ్యక్షుడిగా అర్వ విజయ్ కుమార్(ఆంధ్ర ప్రభ), ప్రధాన కార్యదర్శిగా జహంగీర్(మనం), కోశాధికారిగా కృష్ణమాచారి( మన ఊరు), సంయుక్త కార్యదర్శిగా కృష్ణమోహన్(తెలుగు సత్తా)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా అధ్యక్షుడు ప్రకటించారు. ఈ టీయూడబ్ల్యూజే -143 రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి వర్దల్లి వెంకటేశ్వర్లు, టీయూడబ్ల్యూజే 143 జాతీయ కౌన్సిల్ సభ్యుడు పెరమకొండ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.