వేసవి పంటగా ఉల్లిగడ్డను సాగు చేయాలనుకొనే రైతులకు ఇది మంచి సమయం. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉల్లినారును నాటుకోవచ్చు. నీరు ఇంకిపోయే తేలికపాటి నేలల్లో అధిక దిగుబడులను సాధించవచ్చు. ఇందుకోసం ముందుగా నారుమళ్లను సిద్ధం చేసుకొని, నారు పెంచుకోవాలి. ఉల్లినారును రెండు పద్ధతుల్లో పెంచుకోవచ్చు. మొదటిది చిన్నచిన్న మళ్లలో నాటుకొనే పద్ధతి. రెండోది ఎత్తయిన బెడ్లలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెంచుకోవడం.
ఉల్లి రకాలు
ఉల్లిసాగులో వైట్ ఆనియన్, బళ్లారి రెడ్, పూసా రెడ్, రాంపూర్ రెడ్, అర్క ప్రగతి, అర్క నికేతన్, అర్క కల్యాణ్, రెడ్ రౌండ్, కల్యాణ్ పూర్, ఎన్ 53, అగ్రి ఫౌండ్ లైట్రెడ్, అగ్రి ఫౌండ్ డార్క్ రెడ్, పూసా వైట్రౌండ్, పూసా వైట్ ఫ్లాట్ ముఖ్యమైనవి. డిమాండ్‌ను బట్టి ఈ రకాల్లో దేనినైనా సాగు చేసుకోవచ్చు.
విత్తనం
ఎకరానికి మూడు నుంచి నాలుగు కిలోల విత్తనం అవసరం. కిలో విత్తనానికి 3 గ్రా. కాప్టాన్ లేదా
3 గ్రా. ఆక్సీక్లోరైడ్‌తో విత్తన శుద్ధి చేసుకోవాలి.
నారు పెంపకం
నారుకుళ్లు తెగులు నివారణ కోసం లీటర్ నీటిలో 3గ్రా. కాపర్ ఆక్సీక్లోరైడ్ కలిపి పది రోజులకోసారి పిచికారీ చేసుకోవాలి. రసం పీల్చే పురుగు నివారణ కోసం కార్పోప్యూరాన్ 3జీ గుళికలు నారుమడిలో చల్లి నీరు పెట్టుకోవాలి. నాటుకు ముందే ఎకరానికి లీటర్ ప్లుక్లోరాలిన్ 45శాతం చొప్పున పిచికారీ చేసి, కలియ దున్నుకోవాలి. ఆ తర్వాత ఉల్లినారు వేసుకొంటే, చీడపీడలు ఆశించకుండా ఉంటాయి.