కోటగిరి, జూలై 22: ఆయిల్ పామ్ సాగు అన్నదాతలకు సిరులు కురిపిస్తున్నది. ఆయిల్ పామ్ పంట సాగును బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ప్రారంభించగా, నేడు పంట చేతికొచ్చి లాభాలను తెచ్చిపెడుతున్నది. కోటగిరి మండలంలోని ఎత్తొండలో ఆయిల్ పామ్ దిగుబడులు అధికంగా ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుల భవిష్యతు గురించి దూరదృష్టితో ఆలోచించిన కేసీఆర్, తెలంగాణలో ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించారు.
ఒకప్పుడు ఆయిల్ పామ్ సాగు అంటే ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు మాత్ర మే పరిమితమని భావించారు. అక్కడి వాతావరణ పరిస్థితులకే ఈ పంట అనుకూలమని చెప్పేవారు. ఆయిల్ పామ్ సాగుకు నిజామాబాద్ జిల్లా అనువైనదిగా కేసీఆర్ భావించి తోటల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించి, చైతన్యం చేశారు. ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన రాయితీలను ప్రకటించి ప్రోత్సహించారు. కేసీఆర్ ప్రోత్సాహంతో 2022లో మండలంలో 124 ఎకరాల్లో ఆయిల్ పామ్ తోటలను సాగు చేశారు. మండలంలోని ఎత్తొండ క్యాంప్, ఎత్తొండ, అమ్రాపూర్, సైలాంపూర్, ఎక్లాస్పూర్ క్యాంప్, రాంపూర్, జైనాపూర్,యాద్గార్పూర్ తదితర గ్రామాలను పైలట్‌గా తీసుకొని ఆయిల్ పామ్ సాగును ప్రారంభించారు. ఎత్తొండ క్యాంప్‌లో రైతులు సాగు చేసిన ఆయి ల్ పామ్ తోటల నుంచి గెలలను ముమ్మరంగా సేకరిస్తున్నారు. వాటిని ఒప్పందం చేసుకున్న కంపెనీ సేకరిస్తున్నది.
ఆయిల్ పామ్ సాగుతో లాభాలు..
ఆయిల్ పామ్ సాగులో మంచి లాభాలు వస్తున్నాయి. ఎత్తొండ క్యాంప్ యాద్గార్పూర్లో 15 ఎకరాలు ఆయిల్ పామ్ తోటను సాగు చేశాం. ఆయిల్ పామ్ గెలలు టన్నుకు రూ.23,800 ధర పలుకుతోంది. ఏ పంటకు లేని ధర ఉండడం సంతోషంగా ఉన్నది. నాలుగేళ్ల వరకు సర్కారు రాయితీ ఇస్తుండడంతో రైతుకు నష్టం అనేది కనిపించలేదు. గతేడాది నుంచి గెలలు కోతకు వచ్చాయి. పంట కూడా విక్రయించాం. ఎకరానికి ఖర్చుపోనూ లాభం బాగానే ఉన్నది. కూలీల కొరత తీవ్రంగా ఉన్నది. ఇందుకు కంపెనీ వారు సహకరించాలి.
– రాజా, రైతు ఎత్తొండ క్యాంప్, కోటగిరి మండలం
పంట చేతికొచ్చింది
కేసీఆర్ ప్రభుత్వ హయంలో అనగా 2022లో ఎత్తొండ క్యాంప్ సమీపంలో ఆరెకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసిన. ఏ పంటకు ఇవ్వని సబ్సిడీ బీఆర్ఎస్ సర్కారు ఇవ్వడంతో ఆయిల్ పామ్ పంట వేశాను. ఇప్పటికే నాలుండ్లు కావస్తోంది. ప్రతి ఏటా ఆయిల్ పామ్ తోటలో అంతర పంట సాగు చేసి, లాభాలు గడిస్తున్నాం. గతేడాది నుంచి ఆయిల్ పామ్ గెలల కోత మొదలైంది. ఎకరానికి సుమారు7నుంచి 8 టన్నులు దిగుబడి వచ్చింది. ఒక్కో ఎకరానికి దాదాపు రూ.లక్షా 40 వేల ఆదాయం వచ్చింది. కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగా సాగు చేస్తున్న ఆయిల్ పామ్ పంట లాభదాయకంగా ఉంది.
– మండవ మనోజ్, రైతు, ఎత్తొండ క్యాంప్, కోటగిరి మండలం