కంఠేశ్వర్, జూలై 22 : జిల్లా కేంద్రంలోని పసుపు బోర్డు కార్యాలయం ఎదుట ఉమ్మడి జిల్లా రైతులు పడిగాపులు కాస్తున్నారు. పసుపు ఉడికించే, పాలిష్ చేసే సబ్సిడీ యంత్రాల కోసం అధికారులు దరఖాస్తులు తీసుకుంటున్న నేపథ్యంలో తెల్లవారుజామున మూడు గంటల నుంచే వరుసలో నిలబడుతున్నారు. ఫస్ట్ అప్లికేషన్ ఫస్ట్ ప్రయారిటీ అనే సమాచారముండడంతో రైతులు వరుసలో నిలబడి పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది.
ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు తీసుకుంటుండగా, ఎవరు ముందుగా అప్లికేషన్ ఇస్తే వాళ్లకే యంత్రాలు వస్తాయనటంతో రైతులు చీకటి ఉండగానే వచ్చి వరుసలో నిలబడుతున్నారు. దీనిపై జిల్లా డిప్యూటీ డైరెక్టర్‌ను వివరణ కోరగా, ఈ నెల 31 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, తొలిరోజు 300 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. ఫస్ట్ వన్ ఫస్ట్ సర్వ్ ఆధారంగా పంపిణీ ఉంటుందన్న ఆయన.. ఎంత బడ్జెట్ వస్తుందని ఇంకా సమాచారం రాలేదని తెలిపారు.