హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): ఒడిశాలో సింగరేణి సంస్థకు కేటాయించిన నైనీ కోల్‌బ్లాక్‌లో బొగ్గు తవ్వకాలు చేపట్టేందుకు అన్నివిధాలుగా సహకరిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలంగాణ ప్రతినిధి బృందానికి హామీ ఇచ్చారు. ఇందుకు తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం ఒడిశాలో పర్యటించింది. తొలుత ఆ రాష్ట్ర సచివాలయంలో సీఎంతో భేటి అయ్యి నైనీ కోల్‌బ్లాక్‌లో బొగ్గు బ్లాక్ ప్రారంభానికి, బొగ్గు ఉత్పత్తికి సహకరించాలని కోరగా.. సీఎం మాంఝీ సానుకూలంగా స్పందించారు.
భూముల బదలాయింపు, విద్యుత్తు, రహదారుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేయగా.. వాటిని వెంటనే పరిష్కరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీంతో ఇక్కడ 3 నెలల్లోపే బొగ్గు ఉత్పత్తిని ప్రారంభిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. అనంతరం భట్టి విక్రమార్క అంగూల్ జిల్లాలోని నైని కోల్‌బ్లాక్ ప్రాంతాన్ని సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే అగస్తి బెహరా భట్టి బృందానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వాసితులతోను భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. తెలంగాణ ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్, సింగరేణి సంస్థ సీఎండీ బలరాం, ఇంధన శాఖ ఓఎస్డీ సురేందర్ రెడ్డి, సింగరేణి సంస్థ ఆపరేషన్స్ డైరెక్టర్ ఎన్వీకే శ్రీనివాస్ తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.