– సిబ్బంది తప్ప జనం లేని ప్రజా వేదిక
కారేపల్లి, ఫిబ్రవరి 27 : ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల కేంద్రంలో గల ఎంపీడీఓ కార్యాలయ సమావేశం మందిరంలో శుక్రవారం ఉపాధి పనులపై తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమం తూతూ మంత్రంగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి డీఆర్డీఓ అడిషినల్ పీడీ శ్రీదేవి హాజరయ్యారు. ఉపాధి హామీ చట్టంలో భాగంగా మండలంలోని పంచాయతీలలో 1 ఏప్రిల్, 2024 నుండి 31 మార్చి, 2025 వరకు జరిగిన పనులకు గాను 17వ విడత సామాజిక తనిఖీ బృందం సిబ్బంది తనిఖీ చేశారు. ఉపాధి తనిఖీ ప్రజా వేదికకు అధికారులు, ఉపాధి సిబ్బంది తప్ప జనం రాలేదు. తనిఖీపై సర్వే జరుగుతున్న విషయాన్ని కూడా గోప్యంగా ఉంచి నివేదికలు తయారు చేసుకున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ ఏడాది జరిగిన 561 పనులకు సంబంధించి తనిఖీలలో గుర్తించిన అంశాలపై ప్రజా వేదిక (ఓపెన్ ఫోరం) నిర్వహించారు. అందులో ఎన్ఆర్ఈజీఎస్ కింద 469 పనులు, పీఆర్ కింద 91 పనులు, మన ఊరు-మన బడి(హౌసింగ్) కింద 01 పనిని గుర్తించారు.
ఇందుకు సంబందించి కూలీలు, మెటీరియల్ కింద మొత్తం కలిపి రూ.9,00,32,392 కోట్ల నిధులతో పనులు చేపట్టారు. వారం రోజులుగా తనిఖీ బృందం గ్రామాలలో పర్యటించింది. కూలీలను, ఆయా గ్రామాలలో జరిగిన పనులను పరిశీలించారు. ఎక్కడ అవినీతి జరిగింది అనే కోణంలో తనిఖీ చేశారు. పనులలో జరిగిన తప్పిదాలలో ఉపాధి అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్ నుండి రికవరీ చేయాల్సి ఉంది. కాగా ప్రజా వేదికలో అధికారులు, ఉపాధి సిబ్బంది తప్ప జనం లేకపోవడం పట్ల పలువురు విమర్శలు గుప్పించారు. బహిరంగ ప్రదేశంలో ప్రజా వేదిక నిర్వహించాలని సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు కొండబోయిన నాగేశ్వరావు అధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి.శ్రీనివాసరావు, ఎంపీఓ మల్లెల రవీంద్ర ప్రసాద్, అంబుడ్స్మెన్ రమేశ్ బాబు, విజిలెన్స్ అసిస్టెంట్ మేనేజర్ పవన్ కుమార్, క్వాలిటీ కంట్రోలర్ వీరయ్య, డిప్యూటీ విజిలన్స్ ఆఫీసర్ సక్రియ నాయక్, అసిస్టెంట్ విజిలెన్స్ ఆఫీసర్ శ్రీకాంత్, జూనియర్ క్వాలిటీ కంట్రోలర్ అనిల్ కుమార్, స్థానిక ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.

కారేపల్లిలో నామమాత్రంగా ఉపాధి హామీ సామాజిక తనిఖీ ఓపెన్ ఫోరం