గోదారి తీర ప్రాంత మత్స్యకారుల జీవితం ఆగమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పాపం వారికి శాపంగా మారింది. ఏడాదిన్నర కిందటి వరకు పుష్కలమైన జలాలతో కళకళలాడిన గోదావరిని ఎండబెట్టడంతో చేపల వృత్తిదారుల బతుకు ఎడారిగా మారింది. బరాజ్‌ల గేట్లు బార్లా తెరిచి నీటిని దిగువకు వదలడంతో ఉపాధికి గండి పడింది. నాడు దండిగా వృద్ధి చెందిన తీరొక్క చేపలు, రొయ్యలు పట్టుకుంటూ, రోజుకు రూ.వెయ్యికిపైనే సంపాదించిన మత్స్యకారులు ప్రస్తుతం పనిలేక ఆగమవుతున్నారు. కుటుంబపోషణ కోసం కూలీకి వెళ్తున్నారు. ఇలా ఒకరుకాదు ఇద్దరు కాదు పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని దాదాపు 2500 మంది తెప్ప, తెడ్డు వదిలి ఇతర పనుల్లోకి వెళ్లి బతుకీడుస్తున్నారు.
పెద్దపల్లి, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. మన భూములు బీడు వారుతున్నా నీళ్లను మళ్లించాలన్న ఆలోచన చేయలేదు. కానీ, స్వరాష్ట్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టును ని ర్మించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు దిగువన సుందిళ్ల, అన్నారం, మే డిగడ్డ బ్యారేజీలు నిర్మించి గోదావరిని నిండుకుండలా మా ర్చారు. ఎగువకు నీళ్లను ఎత్తిపోసి భూములను సస్యశ్యామలం చేశారు. ఇదే సమయంలో మత్స్యకారులకు ఉపాధి అవకాశా లు పెంచారు. మూడు బరాజ్‌ల్లో పుష్కలంగా నీరు ఉండడం తో చేపల పెంపకాన్ని చేపట్టారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా ఉచితంగా చేప పిల్లలు పోసింది. ఎల్లంపల్లిలో 12.21లక్షల చేప పిల్లలు, సుందిళ్ల బరాజ్‌లో 11.41లక్షలు, అన్నారం బరాజ్‌లో 8.93లక్షల చేప పిల్లలు పంపిణీ చేస్తూ వచ్చింది. సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లి బరాజ్‌లలో 19లక్షల రొ య్యపిల్లలను పోస్తూ రాగా, గోదావరి తీరం వెంట ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని దాదాపు వేలాది మంది మత్స్యకారుల ఉపాధికి ఢోకా లేకుండా పోయింది. 2019లో ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి చేతినిండా పనితో రందిలేకుండా బతికారు. ఒక్కో మత్స్యకారుడు ఆడుతూ పాడుతూ పనిచేస్తూ రోజూ రూ.వెయ్యికి పైగానే సంపాదించారు. అయితే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయకక్షతో ప్రాజెక్టును ఎండ బెట్టి మత్స్యకారుల నోట్లో మట్టికొట్టింది. బ్యారేజీలు బార్లా తెరిచి చుక్కనీటిని నిల్వ చేయకపోవడంతో గోదారి ఎడారిగా మారింది. ఉపాధి లేక ఏడాదిన్నరగా మత్స్యకారుల బతుకు దుర్భరంగా మారింది.
పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో విస్తరించి ఉన్న గోదావరిపై ఆధారపడే 2500 మంది మత్స్యకారులు బతుకుతున్నారు. అందులో 1500 మంది కేవలం చేపల వేట వృత్తిపైనే ఆధారపడి ఉండగా, మరికొంత మంది వ్యవసాయం, ఇతర పనులను చేసుకుంటూనే వృత్తిని కొనసాగిస్తున్నారు. ఏడాదిన్నరగా బరాజ్‌లలో ప్రభుత్వం నీటిని నిల్వ చేయకపోవడంతో మత్స్యకారులకు పనిలేకుండా పోయింది. పెద్దపల్లి జిల్లాలోని మం థని మండలం ఆరెంద, ఖాన్సాయిపేట, ఖానాపూర్, మంథని, విలోచవరం, పోతారం, నాగారం, గుంజపడుగు, సిరిపురం, బెస్తపల్లి, రామగిరి మండలం జల్లారం, పెద్దంపేట, సుందిళ్ల, రామగుండం మండలం జనగామ, హౌసింగ్‌బోర్డ్ కాలనీ, అంతర్గాం మండలం ఎల్లంపల్లి, కుక్కల గూడూరు, ముర్మూరు గ్రామాల్లోని వందలాది మంది మత్స్యకారులు ఆగమయ్యారు. కుటుంబాలు ఉపాధి దొరక్క కొత్త కొత్త పనుల్లోకి వెళ్తూ బతుకీడిస్తున్నారు.
తెలంగాణ రాక ముందు ఉపాధి కోసం వలసబాట పట్టిన మత్స్యకారులు కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చిన తర్వాత స్వగ్రామాలకు తిరిగొచ్చారు. బ్యారేజీల నిర్మాణంతో గోదావరి నిండుగా మారగా, చేపల వేట చేస్తూ ఆనందంగా జీవించారు. వలలు, తెప్పలు, బోట్లు కొనుక్కొని నాలుగేళ్లపాటు చేపల వేటే ప్రధాన వృత్తిగా ఎంచుకొని జీవించారు. ఉన్న ఊరిలోనే సంతోషంగా గడిపారు. కానీ, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కక్షతో కాంగ్రెస్ సర్కారు కాళేశ్వరం నీళ్లను కిందకు వదలడంతో గోదావరి ఎడారిలా మారింది. ఉపాధి దెబ్బతిని మత్స్యకారుల తినే అన్నంలో మన్నుపోసినట్టయింది. దీంతో మళ్లీ వలసబాట పడతున్నారు. మంథని మండలంలోని బెస్తపల్లిలో మొత్తంగా 300 మత్స్యకార కుటుంబాలు ఉంటే, అందులో 60 కుటుంబాల నుంచి వలసబాట పట్టారు. ఇప్పటికే కొందరు భార్యాపిల్లలను వదిలి వెళ్తే మరికొందరు కుటుంబాలతో కలిసి వెళ్లారు. మరికొంత మంది కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
మా ఉళ్లో 300 బెస్త కుటుంబాలు ఉన్నయి. తొమ్మిదేండ్లు ఎంతో ఆనందంగా ఉన్నం. గోదారి నిండిన తర్వాత వలస వెళ్లినోళ్లు తిరిగి వచ్చి చేపలు పట్టుకొని సంతోషంగా బతికిన్రు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గోదావరిని ఎండబెట్టి మా నోట్లో మట్టికొట్టింది. పచ్చగా ఉన్న మా ఊరు ఆగమైంది. మళ్లీ 70 కుటుంబాలు వలసపోవాల్సిన పరిస్థితి వచ్చింది. నా భార్య మొన్నటిదాకా సర్పంచ్‌గా ఉంది. చేసిన పనిని బిల్లులు రాక అప్పులు పెరిగినయి. ఇటు గోదారిలో నీళ్లు లేక చేపల పట్టే పని లేక చుట్టు పక్కల గ్రామాల్లో నేను సెంట్రింగ్ పని చేసుకుంటూ అప్పులు కడుతున్న.
ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు తాడబోయిన అర్జున్. ఊరు మంథని మండలం ఆరెంద. ఎంకాం దాకా చదివాడు. మంథనిలో ఇల్లు కట్టుకున్నాడు. అక్కడ ఏదైనా వ్యాపారం చేసుకొని స్థిరపడాలనుకున్నాడు. 2019లో కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడం, అన్నారం బ్యారేజీ బ్యాక్ వాటర్ ఏరియాలోనే ఆరెంద ఉండడం, నీళ్లు రావడంతో వెంటనే చేపల వేటలోకి దిగాడు. పెద్ద ఎత్తున వలలు, ఓడలు కొని చేపలు పట్టడం మొదలుపెట్టాడు. రోజు వెయ్యి నుంచి 3వేల సంపాదించుకున్నాడు. నాలుగేళ్లపాటు ఏ రంది లేకుండా బతికాడు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నారం బ్యారేజీ నుంచి నీళ్లను వదిలివేయడంతో గోదావరి ఎడారిలా మారింది. ఉపాధి దెబ్బతిన్నది. ఏం చేయాలో తెలియక ఎవుసంబాట పట్టాడు. అర్జున్ ఒక్కడే కాదు, ఆ గ్రామంలో ఉన్న 30 మంది మత్స్యకారుల జీవితాలు చీకట్లోకి వెళ్లాయి. ఆశతో కొనుగోలు చేసిన వలలు, ఓడలు అన్నీ మూలకు పడేసి ఉపాధి వేటలో పడ్డారు. కొందరు సుతారి కింద కూలీగా, మరికొంత మంది ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ బతుకుతున్నారు. ఇంకొందరు వలసబాట పట్టారు.
గోదావరి గొప్పగా ఉన్నప్పుడు రోజుకు రూ.వెయ్యిపైనే సంపాదించుకున్నం. కానీ ఇప్పుడు గోదారి ఎండబెట్టడంతో బతుకులు ఆగమైనయి. మాకు తెలిసింది చేపలు పట్టడం మాత్ర మే. ఉపాధి పోవడంతో మా జీవితాలు చీకటి అయినయి. ఎక్కడ పని దొరికితే అక్కడికి పోతున్నం. కైకిళ్లు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నం. మళ్లీ గోదారి నిండు కుండలా ఉంటేనే మేం బాగుపడుతం. ప్రభుత్వం గోదారిని నింపి అందరినీ ఆదుకోవాలి.
మా పోతారం గ్రామంలో 36 కుటుంబాలు చేపలు పట్టే బతుకుతయి. గోదారిలో నీళ్లు లేకపోవడంతో మా జీవనాధారం పోయినట్టయింది. నిండుగ ఉన్నప్పుడు రోజూ చేపలు పట్టి పైసలు సంపాదించుకున్నం. కానీ, ఇప్పుడు వలలు, తెప్పలు, బోటు తీయక మూలకు పెట్టినం. ఉపాధి లేక మస్తు ఇబ్బంది అయితంది. ప్రభుత్వం మాకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. మమ్మల్ని ఆదుకోవాలి.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినంక కావాలనే గోదారిని ఎండబెట్టి మా నోట్లో మట్టి కొట్టిన్రు. గుంజపడుగుల దాదాపుగా 500 కుటుంబాలు చేపల పట్టే బతుకుతయి. ఇంత మంది బతుకులను నాశనం చేసింది. నీళ్లు లేక రైతుల పంటలు కూడా ఎండుతున్నయ్. గోదారిలో నీళ్లు ఉంటే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుంది. ప్రభుత్వం ఆలోచించి నీటిని నింపాలి.
గోదారి ఎండడంతో మా ఉపాధి పోయింది. చేపలు పట్టుడు లేక చిన్న చిన్న లేబర్ పనులకు వెళ్తున్న. మా ఉళ్లో 22 కుటుంబాలు ఉన్నయి. గోదారి ఎండడంతో ఇక్కడే ప్రభుత్వం ఇసుక రీచ్ పెట్టింది. దీంట్లో రోజు ట్రాక్టర్లల ఇసుక నింపి కుటుంబాలను పోషించుకుంటున్నం. గోదారిలో నీళ్లు వస్తేనే మాకు మంచి ఉపాధి ఉంటది.