Paddy Grain | నర్సాపూర్, నవంబర్ 4 : వర్షాలకు ధాన్యం తడిసి ఓవైపు రైతులు గగ్గోలు పెడుతుంటే.. పెద్ద రైతుల అజమాయిషితో చిన్న, సన్న కారు రైతులు తలలు పట్టుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఆవంచ గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రైతులు గత 25 రోజుల క్రితం నుండి వరి ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చినా ఇప్పటివరకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించకపోవడం గమనార్హం.
గ్రామానికి చెందిన సుమారు పదిమంది చిన్న, సన్న కారు రైతులు వరి ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చినా కొనుగోలు చేసే నాధుడే కరువయ్యాడు. ఇటీవల కురిసిన వర్షానికి వరి ధాన్యం పూర్తిగా తడిసిపోగా ఆ ధాన్యాన్ని ఆరబెట్టినా కొనుగోలు చేయడానికి నిర్వాహకులు, అధికారులు ముందుకు రావడం లేదు. ధాన్యాన్ని కేంద్రానికి తీసుకువచ్చి 25 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు హమాలీలు రాకపోగా కేంద్రాన్ని కూడా ప్రారంభించలేదు. గ్రామంలో ఉన్న కొందరి పెద్ద రైతుల అజమాయిషితోనే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం లేదని రైతులు వాపోతున్నారు.
ముందు నాట్లు వేయడంతో మా పంట తొందరగా కోతకు వచ్చిందని, పెద్ద రైతులు నాట్లు ఆలస్యంగా వేయడంతో వారి కోతలు ఆలస్యమయ్యాయి అని పెద్ద రైతుల ధాన్యాన్ని తూకం వేసే వరకు మా ధాన్యాన్ని తూకం వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం నిర్వాహకులు, అధికారులు బడా రైతులకు కొమ్ముకాస్తున్నారని, వారు చెప్పినట్టే వినుకుంటా కేంద్రాన్ని ప్రారంభించకుండా సన్నకారు రైతులకు నష్టం కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ విషయంపై పీఏసీఎస్ సీఈవో వెంకటస్వామికి ఫోన్ చేయగా స్పందించలేదు.
పెద్ద రైతులు డ్రామా చేస్తున్నారు : రైతు మన్నె రవీందర్, ఆవంచ
ధాన్యం కొనుగోలు విషయంలో పెద్ద రైతులు డ్రామాలాడుతున్నారు. పెద్ద రైతుల ధాన్యం తూకం వేసే వరకు మా ధాన్యాన్ని తూకం వేయడం లేదు. కొనుగోలు కేంద్రంలో పట్టించుకునే నాధుడే లేడు. మా బాధను ఎవరికి చెప్పుకోవాలో, ధాన్యాన్ని ఎక్కడ అమ్ముకోవాలో అర్థం కావడం లేదు. టార్పాలిన్ లను కూడా పెద్ద రైతులకు ఇస్తున్నారు కానీ మాకు ఇవ్వడం లేదు. గతంలో యూరియా విషయంలో కూడా పెద్ద రైతులు వాళ్ల పేర్లను రాసుకొని యూరియా తెచ్చుకున్నారు.. మాకు మాత్రం ఇప్పించలేదు. ఇప్పటికైనా అధికారులు మా చిన్న రైతులపై దయచూపి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాకు న్యాయం చేయాలి.



Rain Alert | ఈ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు..
Pardipuram | పర్దిపురంలో రోడ్డుపై బైఠాయించి విద్యార్థుల నిరసన : వీడియో