కాంగ్రెస్ పార్టీ మరోసారి వెనుకబడిన వర్గాలకు మొండి‘చేయి’ చూపింది. బీసీలంటే మొదటి నుంచి చిన్నచూపు చూస్తున్న ఆ పార్టీ నాయకత్వం మళ్లీ అన్యాయం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు అరకొరగా సీట్లు కేటాయించిన అధికార పార్టీ.. నిజామాబాద్ లోక్‌సభ టికెట్ కేటాయింపులోనూ రిక్త‘హస్తమే’ చూపింది. వెనుకబడిన వర్గాలకు చెందిన ముఖ్య నేతలు ఎంతగానో ప్రయత్నించినా అధిష్టానం పట్టించుకోలేదు.
జగిత్యాల జిల్లాకు చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని నిజామాబాద్ లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించింది. ప్రస్తుతం పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగుతోన్న జీవన్‌రెడ్డికే టికెట్ కేటాయించడంతో పార్టీలోని బీసీ వర్గాల నేతలంతా మండిపడుతున్నారు. నిజామాబాద్ లోక్‌సభ సీటు కోసం మున్నూరుకాపులు, పద్మశాలీ సామాజిక వర్గానికి చెందిన నేతలు చివరిదాకా పోటీ పడ్డారు. ఏఐసీసీ, పీసీసీ పెద్దలకు వినతులు సమర్పించారు. కానీ వీరిని పట్టించుకున్న వారే లేరు.
Congress | నిజామాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) మొన్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ వెనుకబడిన వర్గాలకు ద్రోహం చేసిందన్న అపవాదు ఉంది. తాజాగా లోక్‌సభ టికెట్ సైతం అగ్రవర్ణాలకే కేటాయించిన కాంగ్రెస్ అధిష్టానంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తున్నట్లు ప్రకటనలు చేసే కాంగ్రెస్ పార్టీ ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన రెండు వారాలకు అభ్యర్థిని ప్రకటించిన హస్తం పార్టీ.. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని వర్గాల మద్దతు కూడగట్టడం కష్టమేననే వాదన వినిపిస్తున్నది.
నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసేదేవరో తేలిపోయింది. బీఆర్ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అర్వింద్ బరిలోకి దిగుతున్నారు. ఈ ముగ్గురు గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందిన వారే కావడం ప్రాధాన్యత సంతరించుకున్నది. జగిత్యాలలో జీవన్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో బాజిరెడ్డి గోవర్ధన్, కోరుట్లలో పోటీ చేసిన అర్వింద్ ధర్మపురి పరాజయం చెందారు. ఓడిన ఈ ముగ్గురు ఇప్పుడు నేరుగా తలపడుతుండడం ఆసక్తి రేపుతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలకు వచ్చిన ఓట్ల లెక్కల ప్రకారం బీఆర్ఎస్ ముందుంది.
నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడుచోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. సీనియర్ రాజకీయ నాయకుడిగా బాజిరెడ్డి గోవర్ధన్‌కు జనాల్లో మంచి పేరుంది. తన సామాజిక వర్గమైన మున్నూరుకాపుల బలం నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో అధికంగా ఉన్నది. మాస్ లీడర్‌గా గుర్తింపు పొందిన బాజిరెడ్డి ఇప్పటికే విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. విజయ అవకాశాలు బీఆర్ఎస్ వైపే ఉన్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంతో పని చేస్తున్నాయి. జహీరాబాద్ నియోజకవర్గంలోనూ బీసీ నేతకే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టికెట్ ఇచ్చారు. గాలి అనిల్‌కుమార్‌కు అవకాశం కల్పించగా, ఆయన ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ స్థానం కావడం తో గెలుపే ధ్యేయంగా గులాబీ శ్రేణులు పాటుపడుతున్నారు.
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సామాజిక సమతూకాన్ని పాటించలేదన్న అభిప్రాయం సొంత పార్టీలోనే నెలకొన్నది. కామారెడ్డి నుంచి పీసీసీ చీఫ్, నేటి సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేశారు. ఎల్లారెడ్డి నుంచి మదన్మోహన్, బాన్సువాడ నుంచి ఏనుగు రవీందర్ రెడ్డి, బోధన్ నుంచి సుదర్శన్‌రెడ్డి, నిజామాబాద్ రూరల్ నుంచి భూపతిరెడ్డి, బాల్కొండ నుంచి సునీల్‌రెడ్డి, ఆర్మూర్ నుంచి వినయ్‌రెడ్డి ఇలా అంతా అగ్రవర్ణాలకు చెందిన వారికే పెద్ద పీట వేశారు. నిజామాబాద్ అర్బన్ మాత్రమే అకస్మాత్తుగా మైనార్టీకి కేటాయించారు. జుక్కల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడ్ కావడంతో ఇక్కడ గత్యంతరం లేక అదే సామాజిక వర్గానికి చెందిన వారిని కాంగ్రెస్ పోటీకి దింపింది.
మిగిలిన 7 స్థానాల్లో ఆరుగురు రెడ్లు, ఒకరు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారిని బరిలోకి దింపింది. అప్పటికప్పుడు పార్టీలు మారిన వారికి ప్రాధాన్యతను కల్పించారు. ఏనుగు రవీందర్‌రెడ్డి, వినయ్‌రెడ్డి ఎన్నికలకు కొద్దిరోజుల ముందే కండువా కప్పుకోగా, టికెట్లు కేటాయించారు. బీసీల్లో బలమైన సామాజిక వర్గంగా గుర్తింపు పొందిన మున్నూరుకాపులు, పద్మశాలీలు, ముదిరాజ్‌లకు కనీసం ఎక్కడా చోటు కల్పించలేదు. మరోవైపు, నిజామాబాద్ లోక్‌సభ పరిధిలోకి వచ్చే జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల అసెంబ్లీ సీట్లను సైతం అగ్రవర్ణాలకే కేటాయించారు. లోక్‌సభ ఎన్నికల్లోనైనా తప్పనిసరిగా బీసీలకు ఏఐసీసీ ప్రాధాన్యం ఇస్తుందని చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆశించారు. అందుకు విరుద్ధంగా జరగడంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన వారంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.