ఖైరతాబాద్, డిసెంబర్ 13: తమ డిమాండ్ల సాధన కోసం నిమ్స్ దవాఖాన నర్సింగ్ ఉద్యోగులు చేపడుతున్న నిరసన కార్యక్రమాలు ఆరోరోజు కొనసాగాయి. నర్సింగ్ ఉద్యోగుల నిరసనకు రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ శనివారం సంఘీభావం ప్రకటించింది. అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరినాథ్ బాబు, శరత్ బాబు మాట్లాడుతూ.. నర్సింగ్ ఉద్యోగులు సమస్యల పరిష్కారానికి యాజమాన్యం త్వరితగతిన చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొందరు వ్యక్తులు నిమ్స్ నర్సింగ్ ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తూ సమస్యలు పరిష్కారమయ్యాయంటూ ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిని నమ్మవద్దని నర్సెస్ యూనియన్ తెలిపింది. తమ డిమాండ్లు నెరవేర్చే వరకు ఆందోళనలను కొనసాగిస్తామన్నారు.

తమ భూములు తమకు కేటాయించాలంటూ భాగ్యనగర్ టీఎన్జీవోలు చేస్తున్న ఆందోళన 151వ రోజుకు చేరుకుంది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు గోపన్‌పల్లిలోని బీటీఎన్జీవోస్ సొసైటీ కార్యాలయం వద్ద దీక్షలు కొనసాగించారు. ప్లకార్డులు చేతపట్టుకొని తమకు న్యాయం చేయాలని నినాదాలిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ మల్లారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వర్, డైరెక్టర్లు ప్రభాకర్‌రెడ్డి, సంధ్యరాణి, రషీదాబేగం, శ్రీధర్‌రెడ్డి, దామోదర్, బెనర్జీలతో పాటు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

-శేరిలింగంపల్లి
ఆదివారం జరిగే రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం సొంతూర్లకు వెళ్లేందుకు బస్సుల్లేక ప్రజలు నరకయాతన పడ్డారు. ‘ఉచిత బస్సు సౌకర్యం’ అని డబ్బా కొట్టుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తగినన్ని బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో బస్టాండ్లలోనే గంటల తరబడి పడిగాపులు కాశారు. ఉన్న కొద్దిపాటి బస్సుల్లో సీట్ల కోసం ఎగబడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. సర్పంచ్ ఎన్నికల్లో ఓటేసేందుకు వెళ్తూ శనివారం మెదక్, జనగామ జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురు బలయ్యారు.

సోయా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం ఆదిలాబాద్ జిల్లా బోథ్ మార్కెట్ యార్డులో రైతులు ఆందోళనకు దిగారు. మండలంలోని కౌట, కనుగుట్ట, పట్నాపూర్, మర్లపల్లి, పిప్పల్‌ధరి గ్రామాలకు చెందిన దాదాపు 100 మందికిపైగా రైతులు మండల కేంద్రంలో గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకొన్న ఎస్సై శ్రీసాయి అక్కడికి చేరుకొని రైతులతో మాట్లాడారు. కలెక్టర్ రావాలని వారు పట్టుబట్టారు. సోమవారం కొనుగోలు చేపడుతామని హెచ్చరించారు. చివరకు పోలీసులు, మారెట్ కార్యదర్శి విఠల్ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ ఆందోళనకు బోథ్ మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మద్దతు తెలిపారు.

– బోథ్