జైపూర్, జూలై 9: బీజేపీ పాలిత రాజస్థాన్లో వర్షం ధాటికి కొత్తగా నిర్మించిన రోడ్డు ఒకటి ప్రారంభోత్సవానికి ముందే కొట్టుకుపోయింది. ఇక్కడి జున్జును జిల్లాలో కట్లి నదికి వరదలు పోటెత్తుతున్నాయి. ఆదివారం కురిసిన భారీ వర్షం దెబ్బకు బాగ్వాలి-జహాజ్ను జాతీయ రహదారికి కలిపే రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో పాప్రా, పాంచ్లాగి గ్రామాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఘటనాస్థలానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ప్రభుత్వ తీరు, నిర్మాణ సంస్థల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు కాగితాలపైనే నాణ్యతను చూపించారని, వాస్తవానికి రహదారి నిర్మాణం నాసిరకంగా ఉందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు కొట్టుకుపోయిన చోట దాదాపు 30 నుంచి 35 అడుగుల లోతు గుంత ఏర్పడింది. దీనిని బట్టి రోడ్డు నిర్మాణం ఎంత నాసిరకంగా ఉందో తెలుస్తున్నదని స్థానికులు మండిపడ్డారు.
గుజరాత్ వర్సిటీలో కలుషిత ఆహారం.. ; 100 మంది విద్యార్థినులకు అస్వస్థత
వడోదర: కలుషిత ఆహారం తిని 100 మంది విద్యార్థినులు తీవ్ర అస్వసత్థకు గురైన సంఘటన బీజేపీ పాలిత గుజరాత్లోని వడోదర మహారాజ సయాజీరావు యూనివర్సిటీ (ఎంఎస్యూ) క్యాంపస్లో మంగళవారం చోటుచేసుకుంది. రాత్రి భోజనం చేసిన కొందరు విద్యార్థినులు వాంతులు, కడుపునొప్పి, డయేరియాతో బాధపడ్డారు. ఆహారం తిన్న 350 మందిలో 150 మందికి ఈ లక్షణాలు కన్పించడంతో వారిని వెంటనే గోత్రి, సయాజీ దవాఖానలకు తరలించారు. ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కలుషిత ఆహారం కారణంగానే ఇది జరిగి ఉండవచ్చునని డాక్టర్లు తెలిపారు. హాస్టల్లోని ఆహార పదార్ధాల శాంపిళ్లను అధికారులు సేకరించారు.