Zomato | గతంలో ఎన్నడూ లేని విధంగా దేశీయ స్టాక్ మార్కెట్లలో సరికొత్త రికార్డులు నమోదయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఐపీఓల ద్వారా లిస్టయిన న్యూఏజ్ కన్జూమర్ టెక్నాలజీ స్టాక్స్ ధగధగలాడాయి. వాటిల్లో కొన్ని దలాల్ స్ట్రీట్ ఫేవరెట్ల జాబితాలో చేరాయి. అందులో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్ ‘జోమాటో’.. టాప్లో నిలిచింది. 2022-23లో 38 శాతం నష్టాలను అధిగమించి 2023-24లో 258 శాతం పుంజుకున్నది. అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జొమాటోలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లకు లాభాల పంట పండింది. జొమాటో ఆర్థిక ఫలితాల్లో మెరుగుదల నమోదు కావడంతో ఇన్వెస్టర్లతో ఆసక్తిని రేకెత్తించింది. గత ఐదు త్రైమాసికాలుగా మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) నికరంగా లాభాలతో రికవరీ సాధిస్తున్నాయి. జొమాటోలో 2023 డిసెంబర్ నాటికి దేశీయ మ్యూచువల్ ఫండ్స్ 12 శాతం వాటా కాలిగి ఉన్నాయి. ఏడాదిక్రితంతో పోలిస్తే ఇది రెట్టింపుకంటే ఎక్కువ.
ఇక ఏడాది కాలంలో మెరుగైన లాభాలు గడించిన మరో సంస్థ పీబీ ఫిన్ టెక్ సంస్థ. 2022-23లో నష్టాల్లో కొనసాగిన పీబీ ఫిన్ టెక్ సంస్థ ఈ ఏడాది తమ ఇన్వెస్టర్లకు 78 శాతం రిటర్న్స్ అందించింది. జొమాటో మాదిరిగా పీబీ ఫిన్ టెక్ సంస్థ సెప్టెంబర్ త్రైమాసికం వరకూ నష్టాల్లో సాగినా.. డిసెంబర్ లో లాభాలు నమోదు చేసింది. మ్యూచువల్ ఫండ్స్ పెట్టబుడులు గల మరో సంస్థ పీబీ ఫిన్ టెక్. ఈ సంస్థలో మ్యూచువల్ ఫండ్స్ సంస్థలకు 10.3 శాతం వాటా ఉంది.
ప్రముఖ బ్యూటీ ప్రొడక్ట్స్ బ్రాండ్ నైకా సైతం 2022-23తో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో సానుకూల రిటర్న్స్ సాధించింది. 2022-23లో 56 శాతం నష్టాలను అధిగమించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నైకా స్టాక్ 31 శాతం పుంజుకున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మెరుగైన రిటర్న్స్ అందుకున్న సంస్థల్లో కార్ గ్రేడ్ టెక్ ఒకటి. 2022-23లో 33 శాతం నష్టాలను సర్దుబాటు చేసుకోవడంతోపాటు ఈ ఏడాది 63 శాతం లాభాలను గడించింది.