టెల్ అవీవ్, ఏప్రిల్ 9 : లెబనాన్‌పై భీకర దాడుల తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గురువారం కీలక ప్రకటన చేశారు. లెబనాన్‌తో ప్రత్యక్ష శాంతి చర్చలకు సిద్ధమని ప్రకటించారు. లెబనాన్ నుంచి పదేపదే విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ఆ దేశంతో ‘వీలైనంత త్వరగా’ శాంతి చర్చలు జరిపేందుకు క్యాబినెట్‌కు అనుమతి ఇచ్చానని వెల్లడించారు. అయితే లెబనాన్‌లోని తిరుగుబాటు సంస్థ హెజ్బొల్లా ఆయుధాలు వీడాలన్నదే చర్చలలో ప్రధాన అంశమని స్పష్టంచేశారు.
ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ భాగం కాదని, హెజ్బొల్లాపై తమ దాడులు కొనసాగుతాయని ప్రకటించిన నెతన్యాహు.. తాజాగా శాంతి చర్చలకు ముందుకు రావడం గమనార్హం. అంతకుముందు లెబనాన్ వ్యాప్తంగా జరిగిన భీకర దాడుల్లో హెజ్బొల్లా అధిపతి నయీమ్ ఖాసెమ్ మేనల్లుడు, సన్నిహిత సహాయకుడు మరణించినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ తన సైనిక దాడులను కొనసాగిస్తుందని నెతన్యాహు గురువారం స్పష్టం చేశారు.