సిద్దిపేట, అక్టోబర్ 29 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే మన వేలితో మన కళ్లల్లో మనమే పొడుచుకున్నట్టేనని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ‘కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది.. కరెంట్ బంద్ అయింది.. పంటలు ఎండిపోతున్నాయి.. కర్ణాటక రైతులు రోడ్ల మీద పడ్డారు.. తప్పిపోయి ఇక్కడ కూడా కాంగ్రెస్‌కు ఓటేస్తే మళ్ల మూడు గంటల కరెంట్ వస్తది జాగ్రత్త అని మనం చెప్పాం. ఇప్పుడు వాళ్ల పార్టీకి చెందిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వచ్చి ఇదే విషయాన్ని కుండబద్ధలు కొట్టారు’ అని అన్నారు. తమ రాష్ట్రంలో ఐదు గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నామని డీకే శివకుమార్ చెప్పారని, వాస్తవానికి ఆ రాష్ట్రంలో వచ్చే కరెంట్ మూడు గంటలు మాత్రమేనని తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్‌లో స్థానిక శాసనసభ్యుడు మదన్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డితో కలిసి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో ఏం చేస్తున్నారో ఉన్నది ఉన్నట్టు చెప్పిన శివకుమార్‌కు ధన్యావాదాలు తెలుపుతున్నానని చెప్పారు. కర్ణాటక రాష్ర్టానికి రండ్రి బస్సు పెడతా అని శివకుమార్ సవాల్ విసిరారని, ‘ఇంకేం చూస్తాం ఉన్నది ఉన్నట్టు మీరే చెప్పిండ్రు కదా.. ఇక చూసేదేముంది.. చెప్పేదేముంది’ అని చురకలంటించారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేక, ఎరువులు దొరకక, నీళ్లు రాక పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తుచేశారు. వ్యవసాయం దండుగ అనే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీనేనని విమర్శించారు. ఇయ్యాళ సీఎం కేసీఆర్ 11సార్లు రైతు బంధు ఇచ్చి వ్యవసాయం పండుగ అయ్యేలా చేసి చూపించారని చెప్పారు.
రైతుబంధు వద్దన్న కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలి
‘కాంగ్రెస్ పార్టీ వాళ్లకు సిగ్గు లేదు. ఢిల్లీకి వెళ్లి యాసంగి పంటకు రైతుబంధు ఇవ్వద్దు అని ఎన్నికల కమిషన్‌కు ఉత్తరం ఇచ్చారు’ అని హరీశ్‌రావు మండిపడ్డారు. రైతుబంధు వద్దన్న కాంగ్రెస్‌కు బుద్ధిచెప్పాలని, ఆ పార్టీని బొందపెట్టాలని పిలుపునిచ్చారు. పీసీసీ చీఫ్ రేవంత్ వ్యవసాయానికి 3 గంటలు, డీకే శివకుమార్ ఐదు గంటలు చాలు అని అంటున్నారని, మళ్లీ పాత రోజలు రావాలా? కర్ణాటక లెక్క ఐదు గంటలే కరెంట్ చాలా? మోటర్లు కాలిపోవాలా? అని ప్రశ్నించారు. మళ్లీ కేసీఆర్‌నే గెలిపించుకోవాలని, జీవితాలను ఇంకా బాగుచేసుకుందామని పిలుపునిచ్చారు.
రైతుబంధును సృష్టించింది కేసీఆరే
కేసీఆర్ సీఎం కాకముందు ఎవ్వరు కూడా రైతుల గురించి ఆలోచన చేయలేదని హరీశ్‌రావు పేర్కొన్నారు. కరెంట్బిల్లు, నీటి తీరువా, భూమిశిస్తు వసూలు చేసేవారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ వచ్చాక నీటి తీరువా, కరెంట్ బిల్లు రద్దు చేసి, రైతుబంధు ఇచ్చారని పేర్కొన్నారు. 2016లో రైతుబంధు ఇస్తామని చెప్పిననాడు ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్లు ఇది ఓట్ల ముందు వచ్చింది.. ఓట్ల ముందు పోతది అని విమర్శలు చేశారని మండిపడ్డారు. కేసీఆర్ మొదట్లో ఎకరానికి రూ. 8 వేలు ఇచ్చారని, తర్వాత రూ.10 వేలు చేశారని, ఇప్పడు ఎకరానికి రూ. 16 వేలు ఇస్తామంటున్నారని చెప్పారు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. విశ్వాసం అని పేర్కొన్నారు.
ఎనకట హిందూ ధర్మంలో సత్యం శివం సుందరం అని ఒకమాట అందురు. శివుడు ఎప్పుడైనా నిజం పలుకుతాడని, శివుడు అబద్ధాన్ని నాశనం చేస్తాడని, ధర్మం వైపు నిలుస్తాడని దానర్థం. నిన్న కర్ణాటక శివుడు (డీకే శివకుమార్) వచ్చి సత్యం చెప్పిపోయిండు. తమ రాష్ట్రం కర్ణాటకలో రైతులకు 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నామని, అంతకంటే ఎక్కువ ఇయ్యడం చేతనైతలేదు అని
కుండబద్ధలుకొట్టిండు.
– మంత్రి హరీశ్‌రావు
కర్ణాటక మాడల్ ఫెయిల్యూర్..
తెలంగాణ మాడల్ కట్క వేస్తే వచ్చే కరెంట్. కర్ణాటక మాడల్.. కటిక చీకట్లోకి నెట్టేసే మాడల్. మనకు కర్ణాటక మాడల్ కావాలా? తెలంగాణ మాడల్ కావాలా? ప్రజలు ఆలోచన చేయాలి. ఐదు గంటలు కరెంట్ కావాలనే వాళ్లు కాంగ్రెస్‌కు ఓటేయండి.. 24 గంటల కరెంట్ కావాలన్న వాళ్లు కారు గుర్తుకు ఓటేయండి.
-మంత్రి హరీశ్‌రావు
నర్సాపూర్ కార్యకర్తలు స్ఫూర్తినిచ్చారు
నర్సాపూర్ నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు గొప్ప స్ఫూర్తిని చాటారని మంత్రి హరీశ్‌రావు అభినందించారు. ‘నిన్న మొన్నటి వరకు మదన్‌రెడ్డి టికెట్టు కావాలని గట్టిగా అడిగారు. కొన్ని కారణాల వల్ల పార్టీ సునీతా లక్ష్మారెడ్డికి ఇచ్చింది. దీనిని పెద్ద మనస్సుతో స్వీకరించిన పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ తల్లిలాంటిదని చెప్పి నిర్ణయానికి కట్టుబడి పని చేస్తామన్నారు. ఆత్మీయ సమ్మేళనానికి ఇంత పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వారందరికీ ధన్యావాదాలు’ అని తెలిపారు. సునీతా లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని, అనంతరం మూడు నెలలకు వచ్చే ఎన్నికల్లో మదన్‌రెడ్డిని ఎంపీగా గెలిపించే బాధ్యతను సీఎం కేసీఆర్ తన మీద పెట్టారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ ఇన్చార్జి, ఎమ్మెల్సీ వెంకట్రామ్రెడ్డి, దేవేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.