Nepal Gen Z Protest | ఏపీ మంత్రి నారా లోకేశ్ అనంతపురం పర్యటన రద్దయ్యింది. నేపాల్‌లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న ఆంధ్రులను సురక్షితంగా ఏపీకి తీసుకురావడంపై దృష్టి సారించడంతో తన పర్యటనను రద్దు చేసుకున్నారు.
అనంతపురంలో ఇవాళ సూపర్ సిక్స్.. సూపర్ హిట్ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఏపీ సీఎం చంద్రబాబు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో నారా లోకేశ్ కూడా ఈ సభ కోసం అనంతపురం వెళ్లాల్సి ఉంది. కానీ నేపాల్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ ఉన్న ఏపీవాసులను రాష్ట్రానికి తీసుకురావడంపై నారా లోకేశ్ ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే అనంతపురం పర్యటనను రద్దు చేసుకుని అమరావతి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్‌కు ఆయన వెళ్లారు. అందులో ప్రత్యేక వార్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.
ఈ ప్రత్యేక వార్ రూమ్‌లో సంబంధిత ఆర్టీజీఎస్ అధికారులతో కలిసి నారా లోకేశ్ సమన్వయం చేస్తున్నారు. ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నంబర్ ఏర్పాటు చేసి పరిస్థితిని, నేపాల్‌లో చిక్కుకున్న వారి వివరాలను సేకరించనున్నారు. దీని ఆధారంగా కేంద్ర ప్రభుత్వం సహకారంతో వారిని తక్షణమే రాష్ట్రానికి తీసుకురానున్నారు.