Malla Reddy | గతంలో ఏపీలో అమ్ముకుని హైదరాబాద్కు వచ్చేవారని.. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ అవుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగోలేదని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. తన పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని మంగళవారం ఉదయం మల్లారెడ్డి దర్శించుకున్నారు.
దర్శనం అనంతరం చామకూర మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ హయాంలో పదేళ్లలో దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణను కేసీఆర్ అభివృద్ధి చేశారని తెలిపారు. హైదరాబాద్కు కేటీఆర్ మల్టీ నేషనల్ కంపెనీలను తీసుకొచ్చారని పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగోలేదని తెలిపారు. గతంలో ఏపీలో అమ్ముకుని హైదరాబాద్కు వచ్చేవారని.. కానీ ఇప్పుడు పరిస్థితి మొత్తం రివర్స్ అవుతోందని ఆవేదన చెందారు. తెలంగాణ వాళ్లు కూడా ఏపీలో ఆస్తులు కొని వ్యాపారాలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణలో మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తేనే పాత రోజులు వస్తాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణకు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఆ దేవుడిని ఈ సందర్భంగా ప్రార్థిస్తున్నానని తెలిపారు.
ఇప్పుడు ఆంధ్రా అంతా కూడా చంద్రబాబు నాయుడు చాలా బాగా అభివృద్ధి చేశాడు.
ఒకప్పుడు ఏపీలో భూములు అమ్మి తెలంగాణలో కొనేవాళ్ళు.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. హైదరాబాద్ లో అమ్ముదాం అంటే కొనేవారు లేరు – మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి#MallaReddy #ChandrababuNaidu #Telangana #AndhraPradesh pic.twitter.com/vUgHNgcJAy
— Telugu Stride (@TeluguStride) September 9, 2025
ఏపీ సీఎం చంద్రబాబుపై కూడా చామకూర మల్లారెడ్డి ప్రశంసలు కురిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు బాగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఏపీకి ప్రధాని మోదీ రూ.లక్షల కోట్లు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. ఏపీలో అభివృద్ధిని చంద్రబాబు పరుగులు తీయిస్తున్నారని వ్యాఖ్యానించారు.