ఖలీల్‌వాడి నవంబర్ 23: ‘సమైక్యాంధ్ర ఉన్నప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం నడుస్తున్నది. అప్పుడు ఎవరూ పట్టించుకునే వారేలేరు. నిధులు, నీళ్లు ఆంధ్రకు పోతున్నాయని, తెలంగాణ ఆగమవుతున్నదని ఉద్యమ సారథి కేసీఆర్ గుర్తించి తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టారు. దీంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆయన పిలుపుమేరకు మేము ఉద్యమ బాట పట్టినం. ఉద్యమంలో ఎన్నో ఆటంకాలు, కుటుంబాలను వదిలి దీక్షలు, ధర్నాలు చేశాం.
కేసులు పెట్టి, జైలుకి పంపితే వెళ్లాం.. తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది. ఎలా మార్పు జరుగుతుంది. ఎవరికి లాభం జరుగుతుందని సీఎం కేసీఆర్ అందరికీ తెలియపర్చారు.’ జిల్లా కేంద్రానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు సూదం రవిచందర్ ఉద్యమ కాలం నాటి తన అనుభవాలనువివరించారు. గురువారం ఆయన ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడారు. ఆయన మాటల్లోనే… ఉద్యమ కాలంలో ఎన్నో కష్టాలు పడ్డాం. అడుగడుగునా ఆనాటి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. బస్సు అద్దాలు పగుల గొట్టామని పోలీసులు అరెస్టు చేసి లాఠీలతో కొట్టారు. ఉద్యమాన్ని ముందుండి నడిపినం. అలా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడు బంగారు తెలంగాణగా మారింది.
దేశంలో ప్రతిపార్టీ రైతే రాజు అని చెప్పుకుంటూ వచ్చాయి. కానీ ఆ రైతు రాజు ఎలా అవుతాడని, ఎవరు చేస్తారని అనుకునేవాడిని. కానీ స్వరాష్ట్రం ఏర్పాడ్డాక కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. వెంటనే రైతు బంధు, రైతుబీమా, ఎరువులు ఇవ్వడంతో రైతు ఆత్మహత్యలు ఆగిపోయాయి. రైతుకు పెట్టుబడి సాయం రావడంతో అప్పు లేకుండా పోయింది. అప్పుడు తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుని రాజు చేశాడని. కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆరు గంటల కరెంట్ అని చెప్పి మూడు నాలుగు గంటల కరెంట్ మాత్రమే ఇచ్చేవారు. ఎండాకాలంలో ఇంట్లో ఉండని పరిస్థితి. రైతులకు నిద్రపట్టని దుస్థితి. రాత్రి ఒంటిగంటకు కరెంట్ వేస్తే కరెంట్ వైర్లు తగిలి, పాముకాటుకు గురై చనిపోయేవారు. వారి గోస తగిలి కాంగ్రెస్ కనబడకుండా పోయింది.
నిజామాబాద్ నగరం పదేండ్ల క్రితంఎలా ఉండేది. ఇప్పుడేలా ఉందో ఒక్క సారి చూడండి. డబ్బులు ఖర్చు అయితేనే అభివృద్ధి జరుగుతుంది. కాంగ్రెస్ హయాంలో ఒక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను వంద కోట్లతో చేపట్టామని గొప్పలు చెబుతున్నారు. ఇప్పుడు ఎన్ని కోట్లయితే అండర్ గ్రౌండ్ డైనేజీ పూర్తి అవుతుందో తెలుసుకోవాలి. మోదీ, రాహుల్‌గాంధీలు తెలంగాణమీదనే ఎందుకు పడుతున్నారు. అధికారం కోసం పోటీ పడుతున్నారు. ఈ విషయాన్ని ప్రజలు ఆలోచించాలి. రోడ్డు విస్తరణ, సెంటర్ మీడియన్, మినీ ట్యాంకు బండ్, వైకుంఠధామాలు, నూతన ప్రభుత్వ కార్యా యాలు ఇవన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగాయి. 50 ఏండ్ల పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీలేదు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా ఇందూరును సుందరంగా తీర్చిదిద్దారు. వందల కోట్ల రూపాయలతో నగరంలో అభివృద్ధి పనులు చేపట్టారు. అభివృద్ధిలో తన మార్కును చూపించారు. ఏది ఏమైనా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. రాష్ర్టాభివృద్ధి ఒక్క సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని అందరూ గ్రహించాలి.