Rain effect : బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో గత రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వివిధ ప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. ఆంధ్రప్రదేశ్లో 294 గ్రామాలు ముంపు బారినపడ్డాయి. ఇప్పటి వరకు 13,227 మందిని ప్రభుత్వం పునరావాస శిబిరాలకు తరలించింది.
ఈ వర్షాలు, వరదల కారణంగా తొమ్మిది మంది మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు రాకపోకలు బంద్ అయ్యాయి. నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద 65వ జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
మున్నేరు వరద ఉధృతితో హైవే వంతెనపై నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. జాతీయ రహదారిపై వరద చేరటంతో నందిగామ పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. శనివారం కూడా జాతీయ రహదారిపై వరద చేరడంతో కొన్ని గంటలపాటు రాకపోకలు బంద్ అయ్యాయి. వరద తగ్గిన తర్వాత మళ్లీ రాకపోకలు సాగాయి. ఇప్పుడు మళ్లీ వరద పెరగడంతో మరోసారి రాకపోకలను నిలిపివేశారు.