మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పది మున్సిపాలిటీలు, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్‌కు నేడు(బుధవారం) పోలింగ్ నిర్వహించనున్నా రు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో ఓటర్ల సంఖ్యకు అనుగుణం గా పోలింగ్ కేంద్రాలు ఏర్పా టు చేశారు. పోలింగ్‌కు అవసరమైన బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర సామగ్రిని మంగళవారమే తరలించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి సామగ్రి తీసుకొని అధికారులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లారు.
ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన చర్యలు చేపట్టామని, బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. శాంతియుత ఎన్నికల నిర్వహణకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో 163 బీఎన్ఎస్ఎస్ యాక్ట్ అమలులో ఉంటుందని అధికారులు స్ప ష్టం చేశారు.
పోలింగ్ కేంద్రాలకు కిలోమీటర్ పరిధిలో కర్రలు, కత్తులు, తుపాకుల వంటి మారణాయుధాలతో సంచరించడం నిషేధమని, తాత్కాలిక నిర్మాణాలైన షామియానాలు, పందిళ్లు ఏర్పాటు చేయడానికి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నా రు. ఎన్నికలు పూర్తయి, 13వ తేదీన ఫలితాలు వెల్లడయ్యే వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. పోలీ స్ సిబ్బందితో ఐదెంచల భద్రత చర్యలు చేపట్టారు.
మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు, లక్షెట్టిపేట మున్సి పాలిటీలో 15 వార్డులు, బెల్లంపల్లిలో 34, చెన్నూర్‌లో 18, క్యాతన్‌పల్లిలో 22 వార్డులు మొత్తం 149 డివిజన్లు, వార్డులకు నేడు(బుధవారం) పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం 75 మంది రిటర్నింగ్ ఆఫీసర్లను నియమించారు. మరో 12 మందిని రిజర్వ్‌లో పెట్టారు. వీరితోపాటు 149 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు నియమించడంతోపాటు, 29 మంది రిజర్వ్‌లో అందుబాటులో ఉంచారు.
మంచిర్యాల కార్పొరేషన్లో 265 పోలింగ్ కేంద్రాలు, లక్షెట్టిపేటలో 30, బెల్లంపల్లిలో 68, చెన్నూర్‌లో 36, క్యాతన్‌పల్లిలో 45 మొత్తం 444 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కేంద్రానికి ఒకరు చొప్పున 444 పీవోలు, ఏపీవోలతోపాటు అదనంగా 110 మంది పీవోలు, ఏపీవోలను రిజర్వ్‌లో ఉంచారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ముగ్గురు చొప్పున ఓపీవోలను నియమించారు. మొత్తం 444 కేంద్రాలకు 1332 ఏపీవోలతోపాటు మరో 235 మంది రిజర్వ్‌లో ఉంచారు. మొత్తంగా ఉమ్మడి జిల్లాలో ఒక కార్పొరేషన్, నాలుగు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు 2566 మంది సిబ్బందిని నియమించారు.
ఆదిలాబాద్ జిల్లా మున్సిపాలిటీలో 49 వార్డులు ఉండగా 1,43,655 మంది ఓటర్లు ఉన్నారు. 216 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. దా దాపు 500 బ్యాలెట్ బాక్స్‌లను అందుబాటులో ఉంచారు. 216 కేంద్రాలకు 260 మంది చొప్పున పీవోలు, ఏపీవోలను నియమించారు. దాదాపు 778 మంది ఓపీవోలు కలుపుకొని మొత్తంగా 1298 మందిని విధులకు కేటాయించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 30 వార్డు లు ఉండగా.. 13,905 మంది ఓటర్లు ఉన్నారు. 85 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 85 మంది పీవోలతోపాటు అదనంగా 17 మందిని రిజర్వ్‌లో పెట్టారు. ఏపీవోలు 255 మందిని నియమించారు. 15మంది చొప్పున రిటర్నింగ్ అధికారులు(ఆర్వో)లు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు(ఏఆర్వో)లను కేటాయించారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డుల పరిధిలో 51,205 మంది ఓటర్లు ఉన్నారు. 85 కేంద్రాలు ఏర్పాటు చేశారు. పీవోలు 85 మంది, ఏపీవోలుగా 255 మంది, ఆర్వోలు, ఏఆర్వోలుగా 50 మందిని నియమించారు.
నిర్మల్ మున్సిపాలిటీలో 42, భైంసాలో 26, ఖానాపూర్‌లో 12 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు మూడు మున్సిపాలిటీల పరిధిలో 244 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆర్వోలు, ఏఆర్వోలు, పీవోలు, ఏపీవోలు, ఓపీవోలు కలుపుకొని 1464 మంది అధికారులు ఎన్నికల విధుల కోసం నియమించారు.
