నిర్మల్, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ) : అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని విస్మరించి, అరాచకాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీని మున్సిపల్ ఎన్నికల్లో ఓడించాలని బోథ్ ఎమ్మెల్యే, నిర్మల్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి అనిల్ జాదవ్ పిలుపునిచ్చారు. మంగళవారం నిర్మల్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 26 నెలల కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క హామీ సక్రమంగా అమలుకాలేదని ఆరోపించారు.
ఆరు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నమ్మిన ప్రజలు గత అసెంబ్లీ ఎన్నికల్లో మోసపోయారని, మళ్లీ ఇప్పుడు ఆ పార్టీకి ఓటేసి మరోసారి మోసపోవద్దని సూచించారు. ఈ నేపథ్యంలో తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను ప్రస్తుతం ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటున్నారన్నారు. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, దివ్యాంగులకు కేసీఆర్ అమలు చేసిన పింఛన్లే అందుతున్నాయని పేర్కొన్నారు.
ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పింఛన్ కూడా పెరగలేదన్నారు. వంటగ్యాస్ సబ్సిడీ రావడం లేదని, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పోర్టల్‌ను కూడా ఎత్తేశారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రైతులు ఎదుర్కొన్న కష్టాలు మళ్లీ ఈ ప్రభుత్వంలో పునరావృతమవుతున్నాయన్నారు. ఎరువులు, విత్తనాల కోసం రోజుల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిన దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందన్నారు.
చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రైతు భరోసా అందడం లేదు. సన్నవడ్లు పండించిన రైతులకు ఇస్తామన్న బోనస్ ఇవ్వకుండా అన్నం పెట్టే రైతన్నను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఓట్లడిగే నైతిక హక్కు లేదన్నారు. బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అబద్ధాల కాంగ్రెస్‌తోపాటు తెలంగాణ అభివృద్ధికి బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించని బీజేపీలకు తమ ఓటుతో గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు.
వారం రోజులుగా నిర్మల్ పట్టణంలో ప్రచారం కోసం ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న విషయాన్ని గుర్తించామన్నారు. మహిళలు, వృద్ధులు, రైతులు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులతోపాటు అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. కేసీఆర్ పాలనే తెలంగాణ ప్రజలకు శ్రీరామరక్షలా భావిస్తున్నారని, ఎక్కడికి వెళ్లినా బీఆర్ఎస్పై ప్రజలు ఆదరణ చూపిస్తున్నారన్నారు. కేసీఆర్ పాలనలోనే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలయ్యాయని, కేసీఆర్ పాలననే బాగుండే అన్న అభిప్రాయాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ఈ ప్రాంత ప్రజల కోరిక మేరకు నిర్మల్ జిల్లాను ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణాను దేశంలోనే నంబర్ వన్‌గా నిలిపిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. కరెంటు కోతలతో తల్లడిల్లుతున్న తెలంగాణలో కోతలు లేని 24 గంటల కరెంటును అందించింది కేసీఆర్ ప్రభుత్వమేనన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాకుండా, ఇవ్వని హామీలైన కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్, రైతుబంధు వంటి పథకాలను విజయవంతంగా అమలు చేసిన కేసీఆర్‌కు అన్ని వర్గాల ప్రజలు అండగా ఉంటామంటున్నారని తెలిపారు.
ఈ మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని ప్రజలు బహిరంగంగా చర్చించుకుంటున్నారన్నారు. వారం రోజులుగా తనతోపాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రతి గడపగడపకు తిరిగి ప్రచారం చేసిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం జరిగే ఎన్నికల్లో కూడా ఇదే ఆదరణతో పట్టణ ప్రజలంతా కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చాలని కోరారు.ఈ సమావేశంలో నిర్మల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి కొరిపెల్లి రాంకిషన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ జీవన్‌రెడ్డి, నాయకులు చిన్నారెడ్డి, మహేశ్‌రెడ్డి, చంద్రశేఖర్, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.