బంజారాహిల్స్, ఫిబ్రవరి 10: పనిచేస్తున్న స్టోర్‌లో రాత్రివేళ ప క్కా ప్రణాళికతో ప్రవేశించి చోరీ చేశాడు.. సీసీ కెమెరాలకు చిక్కకుండా అన్నీ జాగ్రత్త లు తీసుకున్నాడు.. ఉదయాన్నే స్టోర్‌కు వచ్చి దొం గలు పడ్డారంటూ హడావుడి చేశాడు.. అయితే చోరీ సమయంలో వేసుకున్న షూ ముద్రలే అతడిని పట్టించాయి. వెంటనే నిందితుడిని పోలీసులు అరెస్ట్‌చేసి.. అతడి నుంచి చోరీ చేసిన నగదును స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసుల వివరాల ప్రకారం.. మాజీ మంత్రి జానారెడ్డి కోడలు, ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి సతీమణి, ప్రముఖ డిజైనర్ భవానీ అనుశ్రీరెడ్డి బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఎన్బీటీనగర్లో ‘అనుశ్రీరెడ్డి స్టోర్’ పేరుతో డిజైనర్ స్టోర్ నిర్వహిస్తున్నారు. అస్సామ్కు చెందిన అమీనుల్ హక్(38) అనే వ్యక్తి స్టోర్‌లో హౌజ్‌కీపింగ్ పనిచేస్తున్నాడు.
కొన్నినెలలుగా స్టోర్‌లో నమ్మకంగా పనిచేస్తున్న అమీనుల్ హక్..డబ్బులను స్టోర్‌లోని లాకర్లో భద్రపరుస్తున్న విషయాన్ని గమనించాడు. నగదు ఎక్కువగా ఉన్నరోజు చోరీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమం లో శుక్రవారం స్టోర్‌లో కలెక్షన్‌ను సిబ్బంది లాకర్ రూమ్‌లో భద్రపరిచి వెళ్లిపోయారు. కాగా స్టోర్‌లోని కిటికీలు మూసేక్రమంలో అమీనుల్ హక్ ఉద్దేశపూర్వకంగా గడియపెట్టకుండా వదిలేశాడు. అదేరోజు రాత్రి స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలకు చిక్కకుండా కిటికీ గుండా లోనికి ప్రవేశించడంతోపాటు స్క్రూడ్రైవర్ సాయంతో లాకర్‌ను తెరిచి అక్కడున్న రూ.2.43 లక్షల నగదును తస్కరించాడు. వచ్చిన దారిలోనే వెళ్లిపోయి నగదును తన ఇంట్లోని డస్ట్‌బిన్‌లో దాచేశాడు.
మరుసటిరోజు యథావిధిగా డ్యూటీకి వచ్చి అమీనుల్ హక్ ఇతర సిబ్బందితో పాటు లోనికి వెళ్లి చోరీ జరిగిందంటూ హడావుడి చేశాడు. దీంతో సిబ్బంది బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా సమీపంలోని సీసీ కెమెరాలు పరిశీలించగా ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. కాగా క్లూస్ టీమ్ సిబ్బంది కిటికీతోపాటు ఇంట్లో బూట్ల గుర్తులను గుర్తించారు. షూస్‌కు చెందిన ముద్రలను పరిశీలిస్తున్న క్రమంలో స్టోర్‌లో పనిచేస్తున్న అమీనుల్ హక్ ధరించిన షూస్‌ను గమనించారు. అతడి షూస్ ముద్రలను, కిటికీలో లభించిన షూస్ ముద్రలు ఒకటే అని తేలడంతో వ్యవహారం మొత్తం బయటపడింది. పోలీసులు తమదైనశైలిలో అమీనుల్ హక్‌ను విచారించగా చోరీ చేసినట్లు అంగీకరించాడు. నిందితుడివద్దనుంచి రూ.2.30లక్షల నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.