సిద్దిపేట, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని 19 మున్సిపాలిటీల్లో దాదాపు 16 మున్సిపాలిటీల్లో సభలు, కార్నర్ మీటింగ్‌లకు హాజరయ్యారు. ఒక్కో మున్సిపాలిటీల్లో మూ డు నుంచి ఐదు వరకు కార్నర్ మీటింగ్‌ల్లో పాల్గొన్నారు. కొన్ని మున్సిపాలిటీలను రెండు సార్లు చుట్టి వచ్చారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, పార్టీ ఇన్చార్జిలు, నాయకులు, కార్యకర్తలు వారం రోజులుగా పార్టీ అభ్యర్థుల విజయానికి తీవ్రంగా కృషి చేశారు.
గెలుపు గుర్రాలకు టికెట్ ఇవ్వడంతో పాటు పార్టీ గుర్తుపై ఎన్నికలు జరుగుతుండడంతో అధిక మున్సిపాలిటీలు కైవసం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. గల్లీలో ర్యాలీలు, బైక్ ర్యాలీలు, రోడ్ షోలతో ప్రచారాన్ని హోరెత్తించింది. నేడు సిద్దిపేట జిల్లాలో నాలు గు, మెదక్ జిల్లాలో 4, సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల ఎన్నికల పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ 401వార్డులు , కాంగ్రెస్ 402 వార్డులు, బీజేపీ 350 వార్డుల్లో ప్రధాన పార్టీలు పోటీలో ఉన్నాయి. ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 505 వార్డుల్లో బరిలో ఉన్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరింపులకు గురి చేసింది. రెండు రోజులుగా అధికార కాంగ్రెస్ పార్టీ డబ్బు లు, మద్యం విచ్చలవిడిగా పంపిణీ చేసినా బీఆర్ఎస్కు విజయావకాశాలు మెండుగా ఉన్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్కు కంచుకోట. జిల్లాలోని మెజార్టీ మున్సిపాలిటీలను కైవసం చేసుకొని అధికార పార్టీకి సవాల్ విసరాలని బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. గత శాసనసభ ఎన్నికల్లో 10 ఎమ్మెల్యేలకు ఏడు స్థానాలు గెలుచుకొని కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 690కి పైగా గ్రామ పంచాయతీలను గెలుచుకొని తమ సత్తా చాటింది.కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను తమ ఖాతాలో వేసుకునేలా బీఆర్ఎస్ పక్కాగా ఎన్నికల ప్రచారం నిర్వహించింది. జిల్లాలోని ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాణిక్ రావు, ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, ఫరూఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, చంటి క్రాంతి కుమార్, భూపాల్‌రెడ్డి, సతీశ్‌బాబు తమ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలకు, పార్టీ ఇన్చార్జిలు,పార్టీ నేతలకు హరీశ్‌రావు దిశానిర్దేశం చేశారు. పార్టీ ఇన్చార్జిలు అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
అధికార కాంగ్రెస్ పార్టీ పై పట్టణ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రెండున్నరేండ్లలో పట్టణాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. దీంతో పట్టణాలు మురికి కూపంలా మారాయి. దీనికి తోడు కాంగ్రెస్‌లోని వర్గపోరు మున్సిపాలిటీ ఎన్నికలపై ప్రభావం తీవ్రంగా ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి జిల్లాలో ఆందోల్, నారాయణ్‌ఖేడ్, మెదక్, హుస్నాబాద్లోఎమ్మెల్యేలు ఉన్నారు. తమ పరిధిలోని మున్సిపాలిటీలను గెలిపించుకోవాలని గట్టి ప్రయత్నాలు చేశారు. వారికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తమ ఓటు బ్యాంకును కాపాడుకోవాలని ప్రయత్నాలు చేశారు కానీ ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ప్రచారానికి వెళ్లిన కాంగ్రెస్ అభ్యర్థులను ఓట ర్లు నిలదీశారు. ప్రభుత్వం పట్టణాలకు ఏం చేసింది అని నిలదీయడంతో వారు ఏం చెప్పాలో అర్థంకాక అక్కడి నుంచి మొఖం చాటేశారు. మంత్రి వివేక్, దామోదర్, పొన్నం ప్రభాకర్ తమ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఇంత చేసినా మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే స్థానాలు తక్కువే అని చెప్పాలి. దీంతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు లోపాయికారి ఒప్పందానికి దిగాయి. రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్ను ఎదుర్కొవడానికి పెద్ద ఎత్తున మద్యం, డబ్బులు పంపిణీ చేశారు.

మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పట్టణ ప్రజల నుంచి మంచి బీఆర్ఎస్కు స్పందన వచ్చింది. పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.తనదైన శైలిలో హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ లెక్కలతో సహా ఎండగట్టారు. స్థానిక సంస్థలను ప్రస్తావిస్తూ ప్రజలను ఆకట్టుకున్నారు. మళ్లీ సీఎం కేసీఆర్ రావాలి అంటూ ప్రజలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. వద్దు వద్దు ఈ కాంగ్రెస్ అంటూ నినాదాలు మార్మోగాయి. రెండున్నర సంవత్సరాల్లో పట్టణాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఎన్నికల ముందు వచ్చే కాంగ్రెస్ పార్టీ నేతలకు ఓటుతో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో పట్టణాల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం బాకీఉందో విడమరిచి ప్రతి ఓటరును కలిసి చెప్పారు.దీంతో పట్టణ ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రజల నుంచి సానుకూలత రావడంతో బీఆర్ఎస్ అభ్యర్థులు, నేతలు ఉత్సాహంతో ముందుకు కదిలారు. ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు, మున్సిపాలిటీల ఇన్చార్జిలు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు.