ఖైరతాబాద్, జూన్ 29 : ‘రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ క్యాబినెట్లో మున్నూరుకాపులేరి? స్వాతంత్య్ర వచ్చిన ఈ 75 ఏండ్ల చరిత్రలో మున్నూరుకాపులు లేని క్యాబినెట్ ఈ కాంగ్రెస్ హయాంలోనే ఏర్పడింది..’ అని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ధ్వజమెత్తారు. తెలంగాణ మున్నూరుకాపుల సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గం ఎన్నిక ఆదివారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లోని జలవిహార్ వేదికగా ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ఎంపీ వద్దిరాజు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంతోపాటు ప్రత్యేక తెలంగాణలోనూ మున్నూరుకాపులకు పాలక ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం కల్పించాయని గుర్తుచేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో మున్నూరుకాపులు బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే, కాంగ్రెస్ నుంచి 2023లో ఒక్కరు మాత్రమే ఎన్నికయ్యారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మున్నూరుకాపుల ఆత్మగౌరవ భవనం కోసం కోట్లాది రూపాయల విలువైన స్థలంతోపాటు నిధులను కేటాయించారని, నాటి సీఎం కేసీఆర్‌కు మున్నూరుకాపులంటే ప్రేమ ఉండేదని తెలిపారు. కానీ, ఇప్పుడా పరిస్థితులు లేవని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మున్నూరుకాపులే కాదు, బీసీల అణచివేత కొనసాగుతుందని విమర్శించారు. మొక్కుబడిగా కార్పొరేషన్ ప్రకటించినా, రూపాయి కూడా కేటాయించలేదని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలులో ప్రభుత్వానికి అడ్డంకి ఏమున్నదని ప్రశ్నించారు. బీసీ రాజ్యాధికారం కోసం జరిగే ఉద్యమంలో మున్నూరుకాపులు అగ్రభాగాన నిలబడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర జనాభా లో 15 నుంచి 20 శాతం ఉన్న మున్నూరుకాపులను కులగణనతో కాంగ్రెస్ ప్రభుత్వం మూడున్నర శాతానికి పడేసిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు.
చదువు, వ్యాపారరంగంలో రాణిస్తూ ఆర్థికంగా బలపడుతూ రాజ్యాధికారం దిశగా మున్నూరుకాపులు అడుగులు వేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపులు చూపిన ఐక్యతను స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాధికారం సాధించుకోవాలని చెప్పారు. మున్నూరుకాపులు సంఘాలుగా కాకుండా అపెక్స్ కౌన్సిల్ పొందుపర్చిన రాజ్యాంగం ప్రకారం ఒకే కులం, ఒకే సంఘం అన్న నినాదంతో ముందుకు సాగాలని, అపెక్స్ కౌన్సిల్ అత్యున్నత నిర్ణయాక మండలి అని, ఇదే సుప్రీం అని, దాని నిర్ణయాలే అంతిమమని స్పష్టంచేశారు. భవిష్యత్తులో మున్నూరుకాపులందరూ ఒకే గొడుగు కిందకు వస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు. త్వరలోనే హైదరాబాద్‌లో 10 లక్షల మందితో మున్నూరుకాపు గర్జన కార్యక్రమాన్ని నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వానికి సత్తాచూపుతామని హెచ్చరించారు. రాజ్యాధికారం అందుకోవాలంటే ముందుగా సామాజికవర్గపరంగా బలపడాల్సిన అవసరం ఉందని, సరైన ప్రణాళిక, కార్యాచరణతో ముందుకు సాగితే విజయం మనదేనని రిటైర్డ్ జేడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మున్నూరుకాపులకు సముచిత స్థానం కల్పిస్తే ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉద్దేశపూర్వకంగానే అణచివేయాలని చూస్తున్నదని ధ్వజమెత్తారు. సీఎం సొంత సామాజికవర్గానికే అన్నింట్లో ప్రాతినిధ్యం కల్పిస్తూ, బీసీ వర్గాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తున్నదని విమర్శించారు. అపెక్స్ కౌన్సిల్ రూపొందించిన బైలా మున్నూరుకాపులకు రాజ్యాంగం లాంటిదని, సభ్యులందరూ ఆ స్ఫూర్తిని కాపాడుకోవాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాలదే అధిపత్యమని, బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నదని మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ విమర్శించారు. బీసీల్లో బలమైన సామాజికవర్గంగా ఉన్న మున్నూరుకాపులు తమ సత్తాను చాటాలని, రాజ్యాధికారం దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో మన సత్తా చాటాలని సూచించారు. మున్నూరుకాపులకు త్వరలో రాజకీయ తరగతులు నిర్వహిస్తామని అపెక్స్ కౌన్సిల్ సభ్యులు సీ విఠల్, రౌతు కనకయ్య వెల్లడించారు. అనంతరం మున్నూరుకాపుల అధ్యయనం-1920-67 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పటేల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ నెట్వర్క్ ప్రముఖులు డాక్టర్ పీఎల్ఎన్ పటేల్, అపెక్స్ కౌనిల్ సభ్యులు మీసాల చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
జలవిహార్‌లో జరిగిన తెలంగాణ మున్నూరుకాపు సంఘం రాష్ట్ర కమిటీ ఎన్నికల్లో అధ్యక్షుడిగా సర్దార్ పుటం పురుషోత్తం పటేల్, ప్రధాన కార్యదర్శిగా పెద్ది పెంటయ్య పటేల్ ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రధానాధికారిగా సీబీఐ రిటైర్డ్ జేడీ లక్ష్మీనారాయణ, రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి మంగపతి బాబు, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ ఎర్రా నాగేంద్రబాబు, న్యాయ సలహాదారు, న్యాయవాది ఊసా రాము, లవంగాల అనిల్ ఎన్నికల అధికారులుగా వ్యవహరించారు. సంఘం రాష్ట్ర కోశాధికారిగా కంచె సత్యనారాయణ పటేల్, మహిళా అధ్యక్షురాలిగా బండి పద్మ, కార్యనిర్వాహక అధ్యక్షులుగా వేణుగోపాల్ పటేల్, డాక్టర్ జేఎన్ వెంకట్ పటేల్, చల్లా హరిశంకర్ పటేల్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గంతో జేడీ లక్ష్మీనారాయణ ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సభ్యులను సత్కరించారు.