హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ): చేవెళ్ల బస్సు ప్రమాద స్థలి లో బాధిత కుటుంబాలను పరామర్శించేందు కు వెళ్లిన ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. రెండుసార్లు ఎంపీగా ఎన్నుకుంటే.. హైదరాబాద్-బీజాపూర్ హైవేను చేవెళ్ల వద్ద ఎందుకు విస్తరించలేకపోయారని నిలదీశారు. అది బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యమంటూ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యా రు. బీఆర్ఎస్ హయాంలో కూడా ఎంపీగా ఉన్నారు కదా అని నిలదీశారు. కేసీఆర్ ప్రభు త్వం రెండో టర్మ్‌లో రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేసి, నిధులు కేటాయిస్తే.. మర్రిచెట్లు కొట్టేయవద్దంటూ ఉద్యమించి, విస్తరణను అడ్డుకున్నది మీరే కదా అని ప్రశ్నించారు.
ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై నెపం ఎందుకు నెడుతున్నారని నిలదీశారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, విశ్వేశ్వర్‌రెడ్డి నీళ్లు నమిలారు. వాస్తవంగా 2022లోనే రోడ్డు విస్తరణకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నిధులు కూడా కేటాయించింది. కానీ కేసీఆర్ ప్రభుత్వ ప్రణాళికలకు వ్య తిరేకంగా నిరసనలు, ఆందోళనలు నిర్వహించారు. ఆనాడు రోడ్డు విస్తరణను అడ్డుకుని, ప్రభుత్వ చర్యలకు అడ్డంపడి, ఇప్పుడు ప్రమాదంపై మొసలి కన్నీరు కార్చడమేంటని విశ్వేశ్వర్‌రెడ్డిని నెటిజన్లు నిలదీస్తున్నారు. గతంలో కొండా చేసిన ట్వీట్లను గుర్తుచేస్తూ.. వాటిని పోస్ట్ చేస్తూ నిప్పులు చెరుగుతున్నారు.