అశ్వారావుపేట, నవంబర్ 3 : అధిక నికర ఆదాయం ఆశ చూపి కొన్ని మొక్కజొన్న విత్తన కంపెనీలు రైతులను నిలువునా మోసం చేస్తున్నాయి. పెట్టుబడి, ఎరువులు అందిస్తామని ఆర్గనైజర్ల ద్వారా రైతులను మభ్యపెట్టి సీడ్ మొక్కజొన్న సాగు చేయిస్తున్నాయి. తీరా ఆశించిన దిగుబడి రాకపోవడంతో మొహం చాటేస్తున్నాయి. దీంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రతి ఏటా ఈ తతంగం జరుగుతూనే ఉన్నా వ్యవసాయాధికారులు మాత్రం మిన్నకుండిపోతున్నారు. వ్యవసాయ శాఖ కమిషనర్ నుంచే విత్తన కంపెనీలు నేరుగా అనుమతులు తీసుకుంటున్నాయని చేతులెత్తేస్తున్నారు. కనీసం క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయడం లేదు. పైగా విత్తన కంపెనీలకు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలను సైతం రైతుల నుంచి ఎదుర్కొంటున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొన్ని మొక్కజొన్న విత్తన కంపెనీలు ప్రయోగ సాగు కోసం రైతులను ఆశ్రయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్య సాధనే ధ్యేయంగా అధిక దిగుబడి పేరుతో రైతులకు స్పష్టమైన హామీలు ఇస్తున్నాయి. ఎకరాకు 3 నుంచి 6 టన్నుల దిగుబడి వస్తుందని, టన్నుకు రూ.30 వేలు చొప్పున చెల్లించి తిరిగి కొనుగోలు చేస్తామని చెబుతున్నాయి. కానీ, ఎటువంటి అగ్రిమెంట్ ఇవ్వకుండానే కంపెనీ ఆర్గనైజర్ల ద్వారా రైతులను సాగుకు ప్రోత్సహిస్తున్నాయి. కంపెనీల నుంచి విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, ఇతర ఖర్చులకు కొంత పెట్టుబడి సాయం అందించి చివరికి మొహం చాటేస్తున్నాయి. ఆర్గనైజర్ల మాయమాటలు నమ్మి సాగు చేసే రైతులు దిగుబడి రాక ఆర్థికంగా నష్టపోతున్నారు. పెట్టుబడి కోసం ఆశపడి అగ్రిమెంట్లు తీసుకోని రైతులు ప్రశ్నించే హక్కు కోల్పోయి కంపెనీ బాధితులుగా మిగిలిపోతున్నారు. జిల్లావ్యాప్తంగా వేల ఎకరాల్లో విత్తన మొక్కజొన్న సాగు అవుతున్నది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దిగుబడి రాక సుమారు 600 ఎకరాల్లో ఒక్క అశ్వారావుపేట మండలంలోనే రైతులు రూ.1.20 కోట్ల వరకు నష్టపోయారు. జిల్లాలో ఈ నష్టం రూ.కోట్లలో ఉంటుందని అంచనా.
కొన్ని మొక్కజొన్న విత్తన కంపెనీలు ఇష్టారాజ్యంగా దందా సాగిస్తున్నాయి. గుర్తింపు లేని కంపెనీల ఆర్గనైజర్లు కూడా రాష్ర్టానికి సరిహద్దుగా ఉన్న అశ్వారావుపేట, దమ్మపేట మండలాలను టార్గెట్ చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కంపెనీ ఆర్గనైజర్లు ఈ ప్రాంత రైతులను మభ్యపెట్టి సాగును ప్రోత్సహిస్తున్నారు. రైతుల అమాయకత్వాన్ని పెట్టుబడిగా చేసుకొని విత్తనాలు, క్రిమిసంహారక మందులు అంటగడుతున్నారు. కంపెనీ నిబంధనల ప్రకారం ప్రతి రైతుతో అగ్రిమెంట్ చేసుకోవాలి. దిగుబడి రాకపోయినా, ఇతర ఏ సమస్యలు ఎదురైనా రైతులకు కనీస ఆర్థిక రక్షణ ఉండాలన్నది అగ్రిమెంట్ సారాంశం. కానీ, కొన్నేళ్ళుగా అనేక విత్తన కంపెనీలు రైతులకు ఎటువంటి అగ్రిమెంట్లు ఇవ్వకుండానే మొక్కజొన్న విత్తన సాగు చేయిస్తున్నాయి.
వ్యవసాయ శాఖ కమిషనర్ నుంచే కంపెనీలు నేరుగా అనుమతి తీసుకుంటున్నాయనే సాకుతో స్థానిక వ్యవసాయాధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో కంపెనీల దందా ఇష్టానుసారంగా కొనసాగుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అశ్వారావుపేట మండలం నారాయణపురం, అనంతారం, గాండ్లగూడెం, గుమ్మడవల్లి, బచ్చువారిగూడెం తదితర గ్రామాల్లో విత్తన మొక్కజొన్న సాగు చేసిన రైతులు నష్టపోయారు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో కథనం ప్రచురితం కావవంతో అగ్రిమెంట్ లేకపోయినా ఒప్పందం ప్రకారం దిగుబడిలో కొంత తగ్గించి రైతులకు చెల్లించారు. అప్పటికీ రైతులు పడిన కష్టం వృథా కావడంతోపాటు ఆర్థికంగా నష్టపోయారు. అధికారులు మాత్రం అగ్రిమెంట్ లేకుండా విత్తన మొక్కజొన్న సాగు చేసిన రైతులకు ఎటువంటి న్యాయం చేయలేమని చేతులు ఎత్తేస్తున్నారు.
గతేడాది విత్తన మొక్కజొన్న సాగు చేశాను. కంపెనీ ఎటువంటి అగ్రిమెంట్ ఇవ్వలేదు. తోట ఏపుగా పెరిగినా గింజ లేక దిగుబడి రాలేదు. ఎకరాకు 5 టన్నులు దిగుబడి వస్తుందని, టన్నుకు రూ.30 వేలు చెల్లిస్తామని ఆర్గనైజర్లు చెప్పారు. కానీ, ఎకరాకు టన్ను దిగుబడి కూడా రాలేదు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వచ్చిన కథనంతో ఆర్గనైజర్లు స్పందించి కొంత నగదు ఇచ్చారు. ఆ బాధలు పడలేక ఈ ఏడాది వరి సాగు చేస్తున్నాను.
– తుమ్మల మణికంఠ, రైతు, నారాయణపురం
విత్తన మొక్కజొన్న సాగుచేసే రైతులు కచ్చితంగా కంపెనీల నుంచి అగ్రిమెంట్లు తీసుకోవాలి. లేకపోతే దిగుబడి రాకపోయినా, ఇతర సమస్యలు ఎదురైనా కంపెనీల నుంచి పరిహారం పొందలేరు. కంపెనీలు నేరుగా వ్యవసాయ శాఖ కమిషనర్ నుంచి అనుమతులు తీసుకుంటున్నాయి. కనీసం స్థానిక అధికారులకు సమాచారం కూడా ఉండడం లేదు. దీంతో పర్యవేక్షణకు అవకాశం ఉండడం లేదు. రైతులే బాధ్యతగా అగ్రిమెంట్లు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
– రవికుమార్, అగ్రికల్చర్ ఏడీ, అశ్వారావుపేట