Road Accident | అమెరికాలో మంచిర్యాలకు చెందిన ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మిగతా కుటుంబసభ్యులు గాయపడ్డారు.
వివరాల్లోకి వెళ్తే.. మంచిర్యాలలోని రెడ్డి కాలనీకి చెందిన విశ్రాంత సింగరేణి కార్మికుడు పి.విఘ్నేశ్- రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు స్రవంతి, తేజస్వి. ఇద్దరికీ వివాహాలు జరగ్గా.. అమెరికాలో స్థిరపడ్డారు. తేజస్వి గృహప్రవేశం కోసం గత నెల 18న విఘ్నేశ్ దంపతులు అమెరికా వెళ్లారు.
శుక్రవారం పెద్ద కుమార్తె స్రవంతి కుమారుడు నిశాంత్ బర్త్ డే ఉండటంతో విఘ్నేశ్, రమాదేవి, తేజస్వి, ఆమె భర్త కిరణ్ కుమార్, ఇద్దరు పిల్లలు కారులో వెళ్లారు. శనివారం తిరిగి తేజస్వి ఇంటికి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న కారు టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రమాదేవి, తేజస్వి మృతిచెందారు. మిగతా కుటుంబసభ్యులు గాయపడినట్లు సమాచారం.