సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఎడతెరిపిలేని వానతో నగరంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రధాన రహదారులు చెరువుల్లా మారిపోతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద చేరి కాలనీలు, బస్తీల ప్రజలు అవస్థలు పడుతున్నారు. నగరంలోని వాటర్ లాగింగ్ ప్రాంతాలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులపై వరద నీరు ఏరులై పారుతుండటంతో గంటల తరబడిగా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఆఫీస్‌లకు వెళ్లేందుకు, విధులు ముగించుకొని ఇండ్లకు వెళ్లేందుకు వేతన జీవులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీల ఇండ్లలోకి వరద నీరు చేరి వస్తువులు, నిత్యావసరాలు ధ్వంసమవుతున్నాయి.
నాలాలు, మ్యాన్‌హోళ్లు పొంగి పొర్లడంతో మురుగు నీరు రోడ్లు, ఇండ్లలోకి చేరుతున్నది. వరుసగా వర్షాలు కురుస్తున్నా జీహెచ్ఎంసీ, హైడ్రా, పోలీసు విభాగాల అధికారులు సహాయక చర్యలను నామమాత్రంగా చేస్తున్నారని నగర ప్రజలు ఆరోపిస్తున్నారు. వరద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను నియంత్రించడంలో ఆ విభాగం పోలీసులు విఫలమవుతున్నారని మండిపడుతున్నారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో గంటల తరబడి వర్షంలో ఎదురుచూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెరిపివ్వకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని పలు కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద నీరు చేరుతున్నది. కోఠి, అబిడ్స్, బషీర్‌బాగ్, బార్కస్, ఉప్పుగూడ, మల్లాపూర్, లాలాపేట, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, చార్మినార్, వివేకానందనగర్, బాచుపల్లి, హైదర్‌నగర్, ఓయూ, యాకుత్‌పురా, ఆల్విన్‌కాలనీ, ప్రగతినగర్, నిజాంపేట, జేఎన్టీయూ, కూకట్పల్లి, నాచారం, హబ్సిగూడ, తార్నాక, ఛత్రినాక తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మియాపూర్ మంజీరా పైప్‌లైన్ రోడ్డు నుంచి కొండాపూర్ వెళ్లే మార్గంలోని రైల్వే అండర్‌పాస్‌లోకి వరద నీరు చేరింది. యూసుఫ్‌గూడ పరిధిలోని కృష్ణానగర్‌ను వరద వీడటంలేదు. పాతబస్తీలోని పలు కాలనీలు జలమయం అవుతున్నాయి.
నగర వ్యాప్తంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తున్నా..హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది ఎక్కడా కనిపించలేదు. మేయర్ కనీసం బయటకు రాలేదంటూ నీట మునిగిన కాలనీ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడే కనిపిస్తున్నారని జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులపై మండిపడుతున్నారు. ప్రమాదాలు జరగకుండా ముందు చర్యలు చేపట్టి నివారించాల్సిన వారు ఎక్కడా కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజులుగా వర్షం కురుస్తూనే ఉండటంతో కాలనీలన్నీ వరదలోనే ఉన్నాయి. ఏక్షణంలో ఏం జరుగుతుందో తెలియక బస్తీల వాసులు బిక్కుబిక్కుమంటూ వెళ్లదీస్తున్నారు.
నగరంలో భారీ వర్షం కురుస్తుండటంతో స్విగ్గీ, జొమాటో తదితర ఫుడ్ ఆధారిత యాప్ సేవలు అందించే డెలివరీ బాయ్స్ తమ రక్షణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణ గిగ్ వర్కర్స్ యూనియన్ అవగాహన కల్పించింది. రెయిన్ బోనస్ డబ్బుల కోసం రిస్క్ ఏరియాల్లో డెలివరీ సేవలు అందించడం తగ్గించాలని యూనియన్ ప్రతినిధులు సూచించారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని వాపోయారు. గిగ్ వర్కర్లకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని మాటిచ్చి ఇప్పటి వరకు చేయలేదని గుర్తు చేశారు. ప్రమాద బీమాతో కూడిన సామాజిక భద్రత కల్పించాలని, సరైన వేతనాలు అందించేలా చర్యలు తీసుకోవాలని, దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోతే వారికి రూ. 5 లక్షల పరిహారం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.
భారీ వర్షాలతో మూసీకి వరద ఉధృతి పెరిగింది. జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌కు ఎగువ నుంచి వరద పోటెత్తతున్నది. దీంతో ఉస్మాన్‌సాగర్ 12 గేట్లు, హిమాయత్‌సాగర్ 6 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో మూసీ ఉగ్రరూపాన్ని దాల్చింది. వరద నీరు పైనుంచి ప్రవహిస్తుండటంతో మూసారంబాగ్ బ్రిడ్జిపై రాకపోకలు నిలిపేశారు. మూసీ పరీవాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. పరిసరాల్లో ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు నార్సింగి-మంచిరేవుల దారిలో రాకపోకలను నిలిపేశారు. నార్సింగి ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును కూడా బంద్ చేశారు.