బంజారాహిల్స్, సెప్టెంబర్ 26: ‘దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.. ఆయన మరణం తర్వాత నెలరోజులుగా నియోజక వర్గంలో ఏ ఇంటికి వెళ్లినా.. గోపన్న ఇలా ఉండేవారు.. గోపన్న మాకు ఈ సాయం చేసేవారు.. అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. నియోజక వర్గంలోని ప్రజలే మనకు కుటుంబసభ్యులు అంటూ.. జీవితాంతం నమ్మి అనేక కార్యక్రమాలు ప్రజలతోనే జరుపుకొన్నాం. ఏ పండుగ వచ్చినా.. ప్రజలతో మమేకమై చేయడం మాకు అలవాటు. తామంతా మరోసారి గోపన్న కుటుంబానికి అండగా నిలుస్తామంటూ ప్రజలే చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అందించిన సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికే వచ్చి ఇచ్చారని వారు గుర్తుచేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజల అభిమానమే బీఆర్ఎస్ను గెలిపిస్తుందన్న నమ్మకం ఉంది’. అని మాగంటి సునీతా గోపీనాథ్ అన్నారు.
జూబ్లీహిల్స్అభ్యర్థిగా ఎంపికైన తర్వాత ఆమె ‘నమస్తే’తో మాట్లాడారు. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని కంచుకోటగా మార్చిన దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆశయాలను కొనసాగిస్తూ మరోసారి గులాబీ జెండా ఎగురవేస్తామని చెప్పారు. నిరంతరం ప్రజల్లోనే ఉంటూ, నియోజకవర్గ ప్రజలే కుటుంబంగా భావించిన మాగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణం తర్వాత తనకు టికెట్‌ను ఇచ్చి అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు, కష్టకాలంలో తమ కుటుంబానికి అండగా నిలుస్తున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కేవలం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని బలంగా నమ్మిన మాగంటి గోపీనాథ్ బీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన రోజు నుంచి చనిపోయే వరకు నిరంతరం కేసీఆర్‌పై అభిమానం.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలతో ఆత్మీయ అనుబంధం కొనసాగించారు. 1983 నుంచే టీడీపీలో ఉండి ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉన్నారు. ఎన్టీఆర్ తర్వాత తనకు అత్యంత అభిమాన నాయకుడు కేసీఆర్ అని గోపీనాథ్ చెప్పేవారు. బీఆర్ఎస్లోకి వెళ్లిన తర్వాత కేసీఆర్ మాగంటి గోపీనాథ్‌ని సొంత మనిషిలా చూసుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పదవి ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారిన సందర్భంగా మాగంటి కూడా మారుతారని ఊహాగానాలు వచ్చాయి. తాను బతికి ఉన్నంతవరకు బీఆర్ఎస్లోనే ఉంటానని ప్రకటించి..ఆయన తన మాట నిలబెట్టుకున్నారు. మాగంటి మరణం తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నీ తానై కార్యక్రమాలను జరిపించారు. ఆరోజు నుంచి ఈరోజువరకు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నియోజకవర్గంలో అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించాం. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మీద ప్రత్యేక అనుబంధం కారణంగా నియోజకవర్గంలో చిరస్థాయిగా నిలిచిపోయే అభివృద్ధి పనులకు అప్పటి సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నిధులు మంజూరు చేశారు. ఎస్పీఆర్హిల్స్లో క్వారీ ల్యాండ్‌ను గ్రౌండ్‌గా తీర్చిదిద్దడం, దళిత్ స్టడీ సెంటర్ ఏర్పాటు, నియోజకవర్గంలో మంచినీటి సమస్యలు తీర్చేందుకు ఎస్పీఆర్ హిల్స్‌లో భారీ రిజర్వాయర్ నిర్మాణం, వివిధ కాలనీల్లోని పార్కుల అభివృద్ధి, అన్ని ప్రధాన రోడ్లతో పాటు కాలనీలు, బస్తీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ లైన్లు మాగంటి గోపీనాథ్ చొరవతో పూర్తయ్యాయి. ఎర్రగడ్డలోని చాతి ఆస్పత్రి ఆవరణలో అద్భుతమైన రీతిలో టిమ్స్ ఆస్పత్రి ఏర్పాటు చేయించారు. కొన్ని సమస్యలు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పరిష్కారం చేయాలని ప్రణాళికలు సిద్ధంగా ఉన్న సమయంలోనే ఎన్నికలు రావడంతో కొన్ని పనులు నిలిచిపోయాయి. మొత్తంగా నియోజకవర్గంలో అభివృద్ధి మొత్తం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
అధికారంలోకి వచ్చి 20 నెలల దాకా జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని గాలికి వదిలిపెట్టిన కాంగ్రెస్ మంత్రులు, నేతలు మాగంటి మరణం తర్వాత అభివృద్ధి చేస్తామంటూ హడావుడి చేస్తున్నారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను ఆపేసి, అవే పనులను తాము చేస్తున్నట్లు శంకుస్థాపనలు చేస్తున్నారంటూ ప్రజలే చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించడం, కేసులు పెట్టడం, పేదల ఇండ్లను కూల్చేయడమే పనిగా పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు మాగంటి మరణం తర్వాత అభివృద్ధి చేస్తామంటూ చెప్పడాన్ని ప్రజలే నమ్మడం లేదు.
పదేండ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అందుకున్న వేలాది మంది లబ్ధిదారులు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మీద అభిమానంతో ఉన్నారు. 2018 ఎన్నికల్లో సుమారు 64వేల ఓట్లు సాధించిన మాగంటి గోపీనాథ్ 2023లో జరిగిన ఎన్నికల్లో ఏకంగా సుమారు 84వేల ఓట్లు సాధించారంటే దీనికి కారణం బీఆర్ఎస్ పార్టీ పట్ల, మాగంటి మీద అభిమానమే. అదే అభిమానాన్ని ఇప్పుడు కూడా మా మీద జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలు చూపిస్తున్నారు. వారి అభిమానమే మమ్మల్ని గెలిపిస్తుందన్న బలమైన నమ్మకం ఉంది