మారేడ్‌పల్లి, సెప్టెంబర్ 26: మైనర్‌గా ఉన్న కన్న కూతురిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన తండ్రికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. ఈ సంఘటన గోపాలపురం పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కేరళకు చెందిన వ్యక్తి (42) భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి నగరానికి వచ్చి రెజిమెంటల్‌బజార్‌లో నివాసముంటూ స్థానికంగా కిరణాషాపు నిర్వహిస్తుండేవాడు. 9వ తరగతి చదువుతున్న తన కుమార్తె (14)ను దుకాణానికి పిలిపించుకొని అశ్లీల చిత్రాలు చూపించడంతోపాటు బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
పాఠశాలలో బాలికను గమనించిన ఉపాధ్యాయురాలు ప్రశ్నించగా విషయం తెలియజేసింది. వారి సూచన మేరకు బాధితురాలు 2015 ఫిబ్రవరి 12వ తేదీన గోపాలపురం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఇన్స్పెక్టర్ ఎస్.రాంచంద్రారెడ్డి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, పూర్తిస్థాయిలో విచారణ జరిపి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. నాంపల్లి 12వ స్పెషన్స్ జడ్జి టి.అనిత తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని న్యాయ సేవ సంస్థను ఆదేశించింది.