సిటీబ్యూరో, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): బంగాళఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడడంతో గత రెండు రోజులుగా గ్రేటర్ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. అయితే నగర శివారు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వానలతో మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని ప్రధాన బస్‌డిపో ఎంజీబీఎస్‌లోకి వరద నీరు చేరడంతో మోటర్ల సహాయంతో నీటిని బయటకు పంపింగ్ చేశారు.
మరోపక్క చాదర్‌ఘాట్ చిన్న బ్రిడ్జి మీద నుంచి వరద నీరు ఉప్పొంగిపోవడంతో ఆ మార్గం మీదుగా రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కోఠి నుంచి వచ్చే వాహనాలను చాదర్‌ఘాట్ పెద్ద బ్రిడ్జి మీదుగా, ఎంజీబీఎస్ నుంచి చాదర్‌ఘాట్, దిల్సుఖ్నగర్ వైపు వచ్చే వాహనాలను శివాజి బ్రిడ్జి, ఎంజీబీఎస్ వెనక వైపు నుంచి దారిమళ్లించారు. శుక్రవారం రాత్రి 10.30గంటల వరకు పాతబస్తీలోని బార్కాస్‌లో అత్యధికంగా 6.10సెం.మీలు, చాంద్రాయణగుట్టలో 5.70సెం.మీలు, పూల్‌బాగ్‌లో 5.13సెం.మీలు, కాంచన్‌బాగ్‌లో 4.45సెం.మీలు,
బండ్లగూడ ఖాలేందర్నగర్లో 4.20సెం.మీలు, డబీర్‌పురాలో 3.58సెం.మీలు, రాజేంద్రనగర్‌లో 3.45సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. కాగా బంగాళఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశాలుండడంతో మరో రెండు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీంతో గ్రేటర్‌కు ఎల్లో అలర్ట్ జారీచేశారు.