చిగురుమామిడి/ సైదాపూర్, జనవరి 6 : మొంథా తుఫాన్ అక్టోబర్, నవంబర్ నెలల్లో విరుచుకుపడింది. ఉమ్మడి జిల్లాలపై ప్రభావం చూపింది. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. చేతికొచ్చే దశలో నీటిలో మునుగగా, అప్పటికే కోతలు పూర్తయి చేసిన వరి కుప్పలు కొట్టుకుపోయాయి. ఇటు కొనుగోలు కేంద్రాల్లోనూ ధాన్యపు రాశులు తడిసిపోయాయి. కొన్నిచోట్ల కాలువలు, చెరువులకు గండ్లు పడి పంటలు కొట్టుకుపోయాయి. దీంతో అన్నదాతకు కన్నీరే మిగిలింది. అప్పుడు పంట దెబ్బతిన్న రైతులకు ఎకరానికి 10వేల చొప్పున పరిహారం అందిస్తామని ప్రకటించిన ప్రభుత్వం, సర్వేకు ఆదేశించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వ్యవసాయ అధికారులు సర్వే చేసి, పంట నష్టం లెక్క తేల్చారు. ప్రభుత్వానికి కూడా నివేదించారు. ఒక్క చిగురుమామిడి మండలంలో 1793 ఎకరాల్లో వరి, సైదాపూర్ మండలంలో 2448.16 ఎకరాల్లో వరి, 75.16 ఎకరాల్లో పత్తి, ఆరెకరాల్లో మక్కకు నష్టం జరిగినట్టు తేల్చారు. సర్వే చేసి నెలలు గడుస్తున్నా సర్కారు మాత్రం పరిహారం అందించకపోవడంపై రైతులు మండిపడుతున్నారు. పరిహారం అందిస్తే తమకు ఎంతో కొంత సాయమయ్యేదని చెబుతున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి పరిహారం అందించాలని వేడుకుంటున్నారు.
నేను వానకాలం మూడు ఎకరాల్లో వేసిన వరి చేతికొచ్చింది. రెండు రోజుల్లో కొద్దామనుకున్న. కానీ, అంతలోనే పంటలను తుఫాను ముంచింది. వరదతో బండారుపల్లి సమీపం కెనాల్‌కు గండి పడి, 50 ఎకరాల్లో పంట కొట్టుకుపోయింది. ఇసుక మేటలు వేసింది. వ్యవసాయ విస్తరణ అధికారులు వచ్చి పంట నష్టం సర్వే చేసిన్రు. ఎకరానికి 10 వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తదని చెప్పిన్రు. కానీ, ఇప్పటి వరకు నష్టపోయిన ఏ ఒక్క రైతుకు పరిహారం ఇవ్వలేదు. గండిపడిన కెనాల్‌ను మాత్రం ఏ ఒక అధికారి కూడా పరిశీలించలేదు. సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా స్పందించాలి. పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి.