ఎల్లారెడ్డిపేట, జనవరి 6 : యూరియా కోసం రైతులు మళ్లీ అరిగోస పడుతున్నారు. ఒక్క బస్తా కోసం ఎప్పటిలాగే పొద్దటి సందే పీఏసీఎస్ గోదాంల వద్ద బారులు, పడిగాపులు కాస్తున్నారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో యూరియా దొరక్క నిరసన తెలిపారు. స్థానిక గోదాంకు 450 బస్తాలు వచ్చాయని, రైతు వేదికలో టోకెన్లు ఇస్తున్నారని తెలియడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అయితే, రెండు రోజుల క్రితం 450 బస్తాలు రాగా, అవి సరిపోకపోవడంతో అప్పుడు 169 మంది టోకెన్లు రాయించుకుని వెనక్కి వెళ్లిపోయారు. వారితో పాటు మరో 200 మంది రైతు వేదిక వద్దకు చేరుకోగా, ఎకరానికి ఒక బస్తా చొప్పున ఒక రైతుకు గరిష్ఠంగా ఐదు బస్తాలకు మించకుండా ఇస్తామని చెప్పడంతో ఆగ్రహించారు. టోకెన్లు రాయించుకున్న రైతులకు ఒక్కొక్కరికి నాలుగు నుంచి పదెకరాల పొలమున్నదని, వారికే వచ్చిన 450 యూరియా వస్తాలు సరిపోవని, తమకెప్పుడు ఇస్తారని మండిపడ్డారు. వానకాలం సీజన్లోనే యూరియా లేక పంట దిగుబడి తగ్గిందని, పెట్టుబడి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా నాట్లేసి నెల రోజులైనా ఇంకా యూరియా కోసం తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఏవో రాజశేఖర్‌ను సంప్రదించగా, ఇది వరకే 5 లారీల యూరియా బస్తాలు (లోడుకు 450) తెప్పించామని, ఇంకా రెండు లోడ్లు ఇండెంట్ పెట్టామని తెలిపారు.
రోజూ యూరియా, యూరియా అనుకుంట తిరుగుడైతంది. పోయినసారి యూరియా సరిగ్గెయ్యక దిగుబడి రాలే. పెట్టుబడిగూడా లాసయినం. సాయిల్ టెస్టు చేయిస్తే గూడా యూరియా శాతం లేదు. యూరియా సల్లుకుందామంటే గవుర్మెంటు పంపియ్యది. యూరియా అనేది రైతులు తినెతందుకు గాదు. పొలానికే సల్లుకుంటరు. కట్టుదిట్టం జేసి.. జైలులాగా ఏర్పాట్లు జేసి బస్తాలు ఇచ్చుడేందో అర్థమైతలేదు. మరి గవుర్మెంటు ఎవుసం బంజేసుకోమంటదా..? అదన్న సెప్పున్రి. పోలీస్ పహారా మధ్య యూరియా పంచుతున్నరు. ఇదెక్కడి అన్యాయం? ఎందుకిట్ల జేత్తున్నరు. రైతులకు సరిపోయెటంత యూరియా ఇయ్యక పోతె మళ్లీ రోడ్డెక్కే పరిస్థితి వచ్చేటట్టున్నది.
కోనరావుపేట, జనవరి 6 : కోనరావుపేట మండలం నిజామాబాద్‌లోని పీఏసీఎస్ గోదాంకు 444 బస్తాలు రాగా, మంగళవారం 300 మందికి పైగా రైతులు తరలివచ్చారు. ఉదయం నుంచే క్యూలో నిల్చున్నారు. తమ ఆధార్, పాస్ పుస్తకాలను అధికారులకు అందించగా, 210 మంది రైతులకు ఎకరానికి ఒక్కో బస్తా చొప్పున గరిష్ఠంగా రెండు మూడు పంపిణీ చేశారు. దీంతో అందని మిగతా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు వచ్చిన వారికి బస్తాలు ఇవ్వకుండా, తమ ఇష్టారీతిన ఇచ్చారని మండిపడ్డారు. చేసేదేమీ లేక నిరాశతో వెనుదిరిగారు.
నాకు మూడెకరాలన్నరుంది. ఇవ్వారకు ఒక్క యూరియా బస్తా రాలే. బీఆర్ఎస్ ప్రభుత్వమున్నప్పుడు బస్తాలు స్టాకుండేటియి. కాంగ్రెస్ ప్రభుత్వం అచ్చినంకనే యూరియా కొరతైతుంది. ఇప్పటికైనా స్టాక్ తెప్పియ్యాలె. నాటేసి న్లైనా యూరియా ఎయ్యలే. నా నెంబరే ఇవ్వారకు రాయలే.
నాకు మూడెకరాల పొలమున్నది. నాటేసి నెలయితంది. ఇవ్వారకు యూరియా సల్లలేదు. ఇగ టైంకు సల్లకపోతే వరెట్ల లేత్తది. బీఆర్ఎస్ ప్రభుత్వమున్నప్పుడు ఫుల్లు యూరియా బస్తాలు అచ్చినయ్. ఈ గవుర్మెంటు అచ్చినకాడికెళ్లి రైతులకైతే ఎంతో ఇబ్బందైతుంది. నాకు మూడెకరాలుంటే ఇవ్వారకు ఒక్క బస్తా రాలే. మూడు రోజులైతుంది తిర్గవట్టి. ఏంజేసుడో అర్థమైతలేదు.