Monkeypox | ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కరోనా మధ్య యూరప్‌లో మంకీపాక్స్ వైరస్ వ్యాప్తి చెందుతున్నది. గత రెండు వారాల్లో మంకీఫాక్స్ కేసులు మూడు రెట్లు ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ చీఫ్ పేర్కొన్నారు. కేసుల పెరుగుదల భయానకంగా ఉందని, ప్రజలంతా నిరంతరం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు మరింత కృషి చేయాలని బాధిత దేశాలకు విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి మంకీపాక్స్ ఇన్ఫెక్షన్ ఆఫ్రికన్ దేశాల్లో ఎక్కువగా కనిపించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో చాలా అరుదుగానే పరిగణిస్తున్నా.. ఇప్పుడు కేసులు పెరుగుతున్న తీరు శాస్త్రవేత్తలను సైతం ఆందోళన కలిగిస్తున్నది. ప్రపంచ ఆరోగ్య సంస్థ యూరప్ చీఫ్ డాక్టర్ హన్స్ క్లూగే మాట్లాడుతూ.. గతవారమే ఐక్యరాజ్య సమితి ఆరోగ్య సంస్థ కేసుల పెరుగుదలపై ఆందోళన వ్యక్తం చేసిందన్నారు. వైరస్ వ్యాపిస్తున్న వేగం, విధానం చూస్తే గ్లోబల్ స్థాయిల్ తక్షణ చర్యలతో పాటు సమన్వయం అవసరం అన్నారు.
అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 51 దేశాల నుంచి 5వేల కంటే ఎక్కువ మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసుల్లో 90శాతం యూరోపియన్ దేశాల నుంచే నమోదయ్యాయి. 99 శాతం కేసులు పురుషులలో కనిపిస్తున్నాయని నివేదిక చూపిస్తున్నది. స్వలింగ సంపర్కుల్లో ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. చాలా మంది వ్యక్తుల్లో దద్దుర్లు, జ్వరం, అలసట, కండరాల నొప్పులు, వాంతులు, చలి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి.
ది లాన్సెట్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. వైరస్ వ్యాప్తి గతంతో పోలిస్తే.. ఈ సారి రోగుల్లో లక్షణాలు పూర్తిగా భిన్నంగా కనిపిస్తున్నాయి. లండన్‌లోని సెక్కువల్ హెల్త్ క్లీనిక్‌లకు వచ్చిన 54 మంది రోగుల డేటాను పరిశోధకులు అధ్యయనం చేశారు. వీరిలో మే నెలలో 12 రోజుల వ్యవధిలో మంకీపాక్స్ నిర్ధారణ అయ్యింది. ఈ వ్యక్తులకు జననేంద్రియం, మలద్వారం వద్ద చర్మంపై పుండ్లు ఉన్నట్లుగా నిపుణులు గుర్తించారు. గతంలో మంకీపాక్స్ సోకిన సమయంలో ఇలాంటి లక్షణాలు గుర్తించలేదని పేర్కొన్నారు.
పెరుగుతున్న మంకీపాక్స్ కేసుల మధ్య వైరస్‌ను అరికట్టే విషయంలో ప్రజలను నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు. మంకీపాక్స్‌తో బాధపడుతున్న వ్యక్తితో సన్నిహిత, శారీరక సంబంధాలు ఉండకూడదని, అలాగే అతను ఉపయోగించిన బట్టలు.. ఇతర వస్తువులను వాడొద్దని సూచిస్తున్నారు. వాటిని వాడితే వారికి సైతం వైరస్ సోకుతుందని పేర్కొన్నారు. పిల్లలు, గర్భిణులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారి విషయంలో ప్రత్యేక రక్షణ చర్యలు తప్పనిసరి హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం యూకేతో పాటు పలు దేశాలు మంకీపాక్స్ కేసులు వేగంగా పెరుగుతున్నాయని చెల్సియా అండ్ వెస్ట్‌మినిస్టర్ హాస్పిటల్ ఎన్హెచ్ఎస్ ఫౌండేషన్ ట్రస్ట్‌కు చెందిన నికోలో గిరోమెట్టి తెలిపారు. చాలా సందర్భాల్లో స్వలింగ సంపర్కం కారణంగా వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. మంకీపాక్స్ వ్యాప్తిని నిరోధించడంలో మశూచి టీకాలు ప్రభావవంతంగా ఉన్నట్లు గుర్తించారు.