కుభీర్: ఇంటి వాకిట్లో ఆరబోసుకున్న సోయా పంట వద్ద ఉన్న యువరైతుపై కోతులు మూకుమ్మడి దాడి (Monkeys attack ) చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని నిగ్వా గ్రామంలో చోటుచేసుకుంది.
యువ రైతు కదం గణేష్ పటేల్( Farmer Ganesh Patel) గురువారం ఇంటి ముందు వాకిట్లో సోయా పంటను ఆరబోశాడు. సాయంత్రం ఐదు గంటలకి వాటిని ఒక దగ్గరికి చేర్చే క్రమంలో ఎనిమిది నుంచి పది కోతులు ఆయనపై దాడి చేశాయి. అరుపులు, కేకలు వేసినా ఆయనను కిందపడేసి తీవ్రంగా గాయపరిచాయి. స్థానికులు గమనించి కర్రలతో తరమివేయగా కోతులు అక్కడి నుంచి పారిపోయాయి.
వీపు వెనుక భాగంలో తీవ్రగాయం కావడంతో భైంసాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గత కొన్నేళ్లుగా కోతులు చిన్నపిల్లలు, మహిళలు, యువకులపై గాయపరిచినప్పటికీ అటవి శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపించారు. కేసీఆర్( KCR ) ప్రభుత్వ హయాంలో రెండుసార్లు అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకుని కోతులను బోనులో బంధించి కోతుల పునరావాస కేంద్రానికి తరలించారు.
రెండేళ్లుగా గ్రామస్థులు పలుమార్లు ఆ శాఖ అధికారులకు విన్నవిస్తున్నప్పటికీ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన బాధితుడికి నష్టపరిహారం అందించి కోతులను పునరావాస కేంద్రానికి తరలించాలని డిమాండ్ చేశారు.