ICC | ఆసియా కప్ (Asia Cup) ముగిసినా భారత జట్టుకు ట్రోఫీ అందించకపోవడంపై వివాదం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ఫైనల్ తర్వాత ఏసీసీ అధ్యక్షుడు, పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) చీఫ్ మోహ్సిన్ నఖ్వీ (Mohsin Naqvi) వ్యవహరించిన తీరు అందరికీ ఇంకా గుర్తు ఉండే ఉంటుంది. భారత జట్టు తన చేతుల మీదుగానే ట్రోఫీ అందుకోవాలన్న మంకు పట్టుతో ఉన్న నఖ్వీపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. అతడిని గట్టిగా మందలించడం లేదా ఐసీసీ డైరెక్టర్ పదవి నుంచి తొలగించడం వంటి వాటిలో ఏదో ఒకటి చేయవచ్చని విశ్వసనీయంగా తెలుస్తున్నదని జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. వచ్చే నెలలో ఐసీసీ సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా ట్రోఫీని తీసుకుని నఖ్వీ బయటకు వెళ్లిన విషయాన్ని ప్రస్తావించనుంది. అతనిపై చర్యలు తీసుకోవాలని పట్టుబట్టనుందని పేర్కొన్నాయి. ఈ మేరకు బీసీసీఐ (BCCI) రంగం సిద్ధం చేసిందని పీటీఐ వెల్లడించింది.
‘పాక్ క్రికెట్ బోర్డు, నఖ్వీ మున్ముందు ఎలా వ్యవహరిస్తారనేది చూడాలి. ట్రోఫీని తనవద్దే ఉంచుకుని, భారత్‌కు అప్పగించనని చెప్పే హక్కు నఖ్వీకి లేదు. ఆసియా కప్ టోర్నీకి పాక్ అధికారిక ఆతిథ్యం ఇచ్చింది. విజేతగా నిలిచిన టీమ్‌కు ట్రోఫీని ఇవ్వాల్సిందేనని బీసీసీఐ స్పష్టం చేసింది. నఖ్వీ ధోరణి ఇలాగే కొనసాగితే మాత్రం బీసీసీ కఠిన చర్యలకు ఉపక్రమించే అవకాశాలు లేకపోలేదని’ క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదిలా ఉండగా నఖ్వీ మాత్రం ఆసియా కప్ ట్రోఫీని తన ఆజ్ఞ లేకుండా ఎవ్వరికీ ఇవ్వొద్దని ఆదేశించినట్టు ఏసీసీ వర్గాలు తెలిపాయి. ‘ఆసియా కప్ ట్రోఫీ ఇప్పటికీ దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయంలోనే ఉంది. తన ఆదేశం లేకుండా ట్రోఫీని ఎక్కడికీ తీసుకెళ్లరాదని, ఎవ్వరికీ ఇవ్వరాదని ఆయన స్పష్టమైన ఆదేశాలిచ్చారు. బీసీసీఐకి గానీ భారత జట్టు నుంచి గానీ ఎవరైనా వస్తే తన చేతుల మీదుగానే ట్రోఫీని అందజేస్తానని ఆయన ఆదేశించారు’ అని ఏసీసీ ప్రతినిధి ఒకరు చెప్పారు.
ట్రోఫీ మీ సొంతం కాదు..
ఆసియా కప్ గెలిచిన భారత జట్టుకు ట్రోఫీ ఇవ్వకపోవడాన్ని బీసీసీఐ తీవ్రంగా పరిగణించింది. ట్రోఫీ ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు మోహ్సిన్ నఖ్వీ సొంతం కాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. గత నెల 30న దుబాయ్‌లో వాడీవేడిగా జరిగిన ఏసీసీ ఏజీఎంలో ట్రోఫీపైనే ప్రధానంగా చర్చ జరిగిన విషయం తెలిసిందే. బీసీసీఐ తరఫున హాజరైన ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా టీమ్ఇండియాకు ట్రోఫీ అందజేయకపోవడంతో పాటు బహుమతి ప్రదానోత్సవంలో నఖ్వీ వ్యవహరించిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫైనల్లో గెలిచిన జట్టుకు ట్రోఫీని అందజేయాలి. అది ఏసీసీ ట్రోఫీ. ఎవరి వ్యక్తిగతం కాదని ఆయన స్పష్టం చేశారు.