టెన్నెస్సీ: అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రంలో భారీ పేలుడు (Explosion) సంభవించింది. నాష్విల్లేకి 80 కిలోమీటర్ల దూరంలోని బక్స్నార్ట్లో ఉన్న ఓ మిలిటరీ యుద్ధసామగ్రి ప్లాంట్‌లో శుక్రవారం ఉదయం 7.45 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఈ ఘటన (Tennessee Blast) చోటుచేసుకుంది. దీంతో 19 మంది అచూకీ లభ్యం కాలేదు. పేలుడు ధాటికి సమీపంలో ఉన్న కార్లు ఒక్కసారిగా ఎగిరిపడటంతోపాటు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. ఆకాశంలో దట్టమైన పొగ అలముకున్నది. కొన్ని మైళ్ల దూరం వరకు పేలుడు శబ్దం వినిపించినట్లు స్థానికులు తెలిపారు. ఇండ్లు, వాహనాలు కుదుపునకు లోనయ్యాయని వెల్లడించారు. పేలుడుకు సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
పేలుడుకు గల స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదని హంఫ్రీస్ కౌంటీ షెరీఫ్ క్రిస్ డేవిస్ తెలిపారు. ఈ ఘటనలో 19 మంది కనిపించకుండా పోయారని చెప్పారు. గతంలో ఇలాంటి ఘటన తాము చూడలేదన్నారు. ఘటనా స్థలంలో గుర్తించడానికి ఏమీ లేదని, అంతా బూడిదైపోయిందని వెల్లడించారు. కిలోమీటర్ల మేర బూడిద పేరుకుపోయిందని తెలిపారు. ఎఫ్బీఐతోపాటు పలు దర్యాప్తు సంస్థలు ఎంక్వైరీ చేస్తున్నారని, నివేదికకు కొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. అక్యూరేట్ ఎనర్జిటిక్ సిస్టమ్స్‌కు కర్మాగారంలో ఈ పేలుడు జరిగిందని, ఇక్కడ పేలుడు పదార్థాల అభివృద్ధి, తయారీ, నిర్వహణ పనులు జరుగుతుంటాయని అధికారులు చెప్పారు. 2014లో కూడా ఇదే కర్మాగారంలో పేలుడు సంభవించిందని పేర్కొన్నారు. ఆ ఘటనలో ఒకరు మరణించగా, ముగ్గురు గాయపడ్డారని తెలిపారు.