Marufa Akter : మహిళల వన్డే ప్రపంచకప్‌లో స్టార్ బ్యాటర్ల ఎందర ఉన్నా.. వారికంటే ఓ యువ బౌలర్ పేరు మార్మోగిపోతోంది. ఆమె బౌలింగ్‌కు దిగ్గజాలు సైతం ఫిదా అవుతున్నారు. మెగా టోర్నీలో సంచలన ప్రదర్శనతో అందరి ప్రశంసలు అందుకుంటున్న ఆ పేస్ గన్ పేరు మరుఫా అక్తర్ ( Marufa Akter). మూడేళ్ల క్రితమే అరంగేట్రం చేసినా.. ఈ ప్రపంచకప్‌తో ఆమె కెరీర్ మరో స్థాయికి చేరిందనే చెప్పాలి. విశ్వ వేదికపై బుల్లెట్ బంతులతో చెలరేగుతున్న మరుఫా.. బంగ్లాదేశ్ మట్టిలోని మాణిక్యం. చిన్నప్పుడు పేద రైతు బిడ్డగా జీవితంలో ఎన్నో కష్టాలను చవిచూసింది. ఆర్ధిక ఇబ్బందులు, పండక్కి కొత్త బట్టలు కొనుక్కోలేని దుస్థితి.. ఇవన్నీ ఆమెలో ఏదైనా సాధించాలనే కసిని రగిల్చాయి. కన్నీళ్లను దిగమింగి.. క్రికెటర్‌గా రాణిస్తున్ను ఈ యంగ్‌స్టర్ గురించిన ఆసక్తికర విషయాలివి..
జాతీయ జట్టుకు ఆడాలనే కలను నిజం చేసుకున్న మరుఫా అక్తర్ ‘టాక్ ఆఫ్ ది వరల్డ్ కప్’గా మారింది. లైన్‌అండ్ లెంగ్త్‌తో కూడిన బౌలింగ్, బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల నేర్పు కలిగిన ఈ పేసర్‌ను బంగ్లా జట్టు తరుపుముక్కగా అభివర్ణిస్తున్నారు పలువురు. బంగ్లాదేశ్ మహిళా క్రికెట్లో మరుఫా లాంటి డేంజరస్ పేసర్‌ను ఇంతవరకూ చూడలేదని కెప్టెన్ నిగర్ సుల్తానా కితాబు.. మరుఫా వేసిన ఇన్‌స్వింగర్ ఈ ప్రపంచ కప్‌లో అత్యుత్తమం అని లసిత్ మలింగ (Lasith Malinga) ప్రశంసలు.. కెరీర్ ఆరంభంలోనే ఒక క్రికెటర్‌కు ఇంతటి గుర్తింపు రావడం చిన్నవిషయం కాదు.
A fearless effort 💪🔥 | Marufa Akter struck twice with the ball, showcasing her pace and passion as the Tigresses fought till the end. 🇧🇩
Photo Credit: ICC/Getty#Bangladesh #TheTigress #BCB #Cricket #WomenWorldCup #Cricket #TigressForever #WomenWorldCup2025 #CWC25 pic.twitter.com/P9ATK0F4Cp
— Bangladesh Cricket (@BCBtigers) October 7, 2025
మరుఫాది ఉత్తర ప్రాంతలోని నిల్ఫమరి అనే మారుమూల గ్రామం. ఆమె తండ్రి ఐముల్లా హక్ భూమిని నమ్ముకున్న రైతు. పేదకుటుంబంలో పుట్టిన తను క్రికెటర్ అవ్వాలనుకుంది. కానీ, అది తమ శక్తికిమించినది అనే విషయం త్వరగానే అర్ధం చేసుకుంది మరుఫా. అయినా సరే టెన్నిస్ బంతులతో దగ్గర్లోని రైల్వే ట్రాక్ మైదానంలో బౌలింగ్ సాధన చేసేది. ఆమె ప్రతిభను గమనించిన సోదరుడు అల్ అమిన్ తనకు క్రికెట్ కిట్ కొనిచ్చాడు. అలా.. కుటుంబసభ్యుల ప్రోత్సాహంతో తనకల వైపు అడుగులేసిన మరుఫా 15 ఏళ్లకు ఒక స్థానిక క్యాంపులో అదరగొట్టింది. దాంతో బంగ్లాదేశ్ క్రీడా శిక్ష కేంద్రంలో ఆమెకు చోటు దక్కింది.
తల్లిదండ్రులు, సోదరుడితో మరుఫా
అక్కడితో తన లైఫ్ మలుపు తిరిగింది. అక్కడి కోచ్‌ల సలహాలతో తన నైపుణ్యాలను మెరుగుపరచుకున్న మరుఫా బంతిని రెండు వైపులా స్వింగ్ చేయండంలో మెరుగయ్యింది. అండర్ -19 టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లా తరఫున అత్యధిక వికెట్లతో సీనియర్ జట్టు సెలెక్టర్ల దృష్టిలో పడింది. మూడేళ్ల క్రితం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డేల్లో అరంగేట్రం చేసిందీ స్పీడ్ ఎక్స్‌ప్రెస్. ఇప్పటివరకూ 29 వన్డేల్లో 25 వికెట్లు పడగొట్టింది. టీ20ల్లోనూ తన పేస్ పవర్ చూపిస్తూ 20 వికెట్లు తీసిందీ యంగ్‌స్టర్. నిరుడు వెస్టిండీస్ బ్యాటర్‌ను క్లీన్‌బౌల్డ్ చేసిన మరుఫా.. వికెట్ తీశాక బిగ్గరగా అరుస్తూ సంబురాలు చేసుకుంటుంది.
పొలం పనులు చేస్తున్న మరుఫా
అడుగడుగునా ఆర్ధిక ఇబ్బందులు.. ఏడాదికోసారి వచ్చే ఈద్ పండక్కి కొత్త బట్టలు కొనుక్కోలేని దుస్థితి.. చిరిగిన దుస్తులను చూసి గ్రామస్థుల చీత్కారపు మాటలు.. మరొకరైతే కుంగిపోయేవారు. కానీ, మరుఫా అక్తర్ మాత్రం ఆ అవమానాలను, ఆర్ధిక కష్టాలను తన విజయానికి సోపానాలుగా మార్చుకుంది. కష్టపడే తత్వంతో మెరుగవుతూ వచ్చిన మరుఫా.. పదమూడో సీజన్ వన్డే వరల్డ్ కప్‌లో నిప్పులు చెరుగుతోంది. కొత్త బంతితో పవర్ ప్లేలో వికెట్లు తీస్తూ బంగ్లాదేశ్‌కు శుభారంభాలు ఇస్తున్న 20 ఏళ్ల పేస్ గన్.. పాకిస్థాన్‌పై తొలి ఓవర్లోనే వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఓపెనర్ ఒమైమా సొహైల్‌ను ఇన్ స్వింగర్‌తో బౌల్డ్ చేసి దిగ్గజాల ప్రశంసలు అందుకుందీ పేసర్. పాక్‌పై 2/31తో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకుంది. ఆ తర్వాతి గేమ్‌లో ఇంగ్లండ్‌పై రెండు వికెట్లతో హడలెత్తించిందీ స్పీడ్‌స్టర్.
ఇంతకు ఈ యంగ్ సెన్సేషన్‌కు రోల్ మోడల్ ఎవరో తెలుసా.. మిచెల్ స్టార్క్ (Mitchell Starc) . ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ నాకు ఆదర్శం. అతడు బంతిని అద్భుతంగా స్వింగ్ చేస్తాడు. యార్కర్ కింగ్ అయిన అతడిని చూసి చాలా నేర్చుకున్నాను. అతడిలానే వికెట్ల వేట కొనసాగించాలని అనుకుంటున్నాని చెబుతున్న మరుఫా మహిళా క్రికెట్లో తనకంటూ కొన్ని పేజీలు రాసుకోవాలనే పట్టుదలతో ఉంది.
‘మాది పేదకుంటుంబం కావడంతో చిన్నప్పటి నుంచి నాన్నకు సాయంగా పొలం పనులు చేసేదాన్ని. కరోనా సమయంలో పొలానికి వెళ్లాను. అయితే.. నేను ఏదైనా చిన్న జాబ్ చేసినా చాలు అనుకునేవారు నాన్న. కానీ, నేను రోజురోజుకు క్రికెట్లో
రాణించడం చూసి నన్ను నెమ్మదిగా ప్రోత్సహించారు. అమ్మ, సోదరుడు వెన్నుతట్టడంతో.. వాళ్ల నమ్మకాన్ని నిలబెడుతూ జాతీయ జట్టులోకి వచ్చాను. దేశానికి ప్రాతినిధ్యం వహించడం ఆనందంగా ఉంది.. నా కుటుంబానికి అండగా నిలుస్తున్నా. చాలామంది అబ్బాయిలు ఇది కూడా చేయడం లేదని తెలిసి ఆడపిల్లగా గర్వపడుతున్నా.
చిన్నప్పుడు నా బౌలింగ్‌ను అందరూ ప్రశంసిస్తుంటే చాలా సంతోషపడేదాన్ని. ఇప్పుడు వరల్డ్ కప్‌లో రాణించడం గొప్పగా అనిపిస్తోంది. అయితే.. నాకు టీవీలో కనిపించడం మాత్రం సిగ్గుగా అనిపిస్తోంది’ అంటున్న ఈ పేసర్ వరల్డ్ కప్ ప్రదర్శనతో టీ20 లీగ్స్ ఫ్రాంచైజీల దృష్టిలో పడింది. బీసీసీఐ నిర్వహించే మహిళల ప్రీమియర్ లీగ్(WPL)లోనూ మెరవాలని అనుకుంటోంది వరల్డ్ కప్ స్టార్. ఈతరం అమ్మాయిలకు స్ఫూర్తినిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఫాస్ట్ బౌలర్ అయినందున మరుఫా తన ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. ఒకప్పుడు 25-30 కిలోలు మాత్రమే ఎత్తిన తను ప్రస్తుతం.. 42 -44 కిలోల బరువుల్ని లిఫ్ట్ చేస్తోంది. అంతేకాదు.. 60 కిలోలతో స్క్వాట్స్ చేయడం మొదలుపెట్టింది. బంగ్లాదేశ్ సూపర్ స్టార్‌గా అవతరించిన మరుఫా.. గొప్ప బౌలర్‌గా ఎదగాలనుకుంటోంది. ఆల్ ది బెస్ట్ మరుఫా.