భారత్, వెస్టిండీస్ మధ్య ఢిల్లీ వేదికగా శుక్రవారం నుంచి మొదలైన రెండో టెస్టులో తొలి రోజే భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ తన కెరీర్లో ఐదో 150+ స్కోరుతో గర్జించగా.. జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి యత్నిస్తున్న సాయి సుదర్శన్ కళాత్మక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సాయి తృటిలో తొలి శతకాన్ని కోల్పోయినా జైస్వాల్‌తో కలిసి రెండో వికెట్‌కు రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. జైస్వాల్, గిల్ క్రీజులో ఉండగా చేతిలో మరో 8 వికెట్లు ఉండటంతో రెండో రోజు భారత్ భారీ స్కోరు చేయకుండా అడ్డుకోవడం విండీస్‌కు శక్తికి మించిన పనే!
ఢిల్లీ: క్రీజులో కుదురుకుంటే భారీ స్కోర్లు చేసే అలవాటు కల్గిన యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (253 బంతుల్లో 173 నాటౌట్, 22 ఫోర్లు) మరోసారి చెలరేగడంతో ఢిల్లీలో వెస్టిండీస్‌తో మొదలైన రెండో టెస్టులో భారత్ తొలిరోజే పటిష్ట స్థితిలో నిలిచింది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ టెస్టులో జైస్వాల్ అజేయ శతకానికి తోడు సాయి సుదర్శన్ (165 బంతుల్లో 87, 12 ఫోర్లు), కేఎల్ రాహుల్ (38) రాణించడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి టీమ్ఇండియా 90 ఓవర్లకు 2 వికెట్లు మాత్రమే నష్టపోయి 318 రన్స్ చేసింది. జైస్వాల్‌తో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (20 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. విండీస్ బౌలర్లలో స్పిన్నర్ జొమెల్ వారికన్ (2/60) మినహా మిగిలినవారంతా తొలి రోజు రిక్తహస్తాలతో వెనుదిరిగారు.
ఇన్నింగ్స్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచే జైస్వాల్.. ఢిల్లీలో అందుకు భిన్నంగా బ్యాటింగ్ చేశాడు. క్రీజులో నిలదొక్కుకునేదాకా బ్యాట్‌ను ఝుళిపించని అతడు.. అర్ధ శతకం తర్వాత తనలోని అసలు ఆటను బయటకు తీశాడు. తొలి సెషన్లో రాహుల్ అడపాదడపా బౌండరీలు బాదినా జైస్వాల్ మాత్రం పూర్తి నియంత్రణతో బ్యాటింగ్ చేశాడు. దీంతో భారత ఇన్నింగ్స్ నెమ్మదిగానే మొదలైంది. ఐదు బౌండరీలతో పాటు ఒక సిక్సర్‌తో అలరించిన రాహుల్.. వారికన్ వేసిన తొలి (ఇన్నింగ్స్ 18వ) ఓవర్లోనే ముందుకొచ్చి ఆడబోయి స్టంపౌట్ అయ్యాడు. అతడి స్థానంలో వచ్చిన సాయి కూడా నెమ్మదిగానే ఆడటంతో మొదటి సెషన్లో భారత్ 28 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 94 పరుగులే చేయగలిగింది.
భోజన విరామం తర్వాత సీల్స్ వేసిన మొదటి ఓవర్లోనే మూడు బౌండరీలతో 82 బంతుల్లో జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తయింది. మరో ఎండ్‌లో సాయి కూడా స్పిన్నర్లను సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. పియరె వేసిన 45వ ఓవర్లో బంతిని మిడాఫ్ దిశగా తరలించిన సాయి తన కెరీర్లో రెండో అర్ధ శతకాన్ని నమోదుచేశాడు. డ్రింక్స్ విరామం తర్వాత ఈ జోడీ జోరు పెంచింది. ఫిలిప్ బౌలింగ్‌లో రెండు బౌండరీలతో 90లలోకి వచ్చిన జైస్వాల్ పియరె ఓవర్లో డబుల్‌తో తన కెరీర్లో ఏడో శతకాన్ని పూర్తిచేశాడు. మొదటి 50 రన్స్ కోసం 82 బంతులాడిన అతడు.. తర్వాత ఫిఫ్టీని 63 బంతుల్లోనే బాదేశాడు. 48 ఇన్నింగ్స్‌ల్లోనే అతడు ఏడు సెంచరీలు నమోదుచేయడం గమనార్హం.
రెండో సెషన్లో 30 ఓవర్లు ఆడిన జైస్వాల్, సాయి.. 126 రన్స్ జోడించారు. కళాత్మక ఆటతో మెప్పించిన సాయి.. తన ఇన్నింగ్స్‌లో ఒక్క చెత్త షాట్ కూడా లేకుండా ఆడి టీమ్ మేనేజ్మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. అయితే సెంచరీకి 13 పరుగుల దూరంలో ఉండగా వారికన్ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకోవడంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. సాయి, జైస్వాల్ రెండో వికెట్‌కు 193 పరుగులు జతచేయడం విశేషం. సాయి నిష్క్రమించినా కెప్టెన్ గిల్ అండతో జైస్వాల్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి ద్విశతకానికి 27 రన్స్ దూరంలో నిలిచాడు.
1 కెప్టెన్‌గా టాస్ గెలవడం గిల్ కెరీర్ (7టెస్టులు)లో ఇదే మొదటిసారి.
4 టెస్టుల్లో 24 ఏండ్లలోపే అత్యధిక శతకాలు చేసినవారిలో బ్రాడ్‌మన్ (12), సచిన్ (11), సోబర్స్ (9) తర్వాత జైస్వాల్ నాలుగో స్థానంలో ఉన్నాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 90 ఓవర్లలో 318/2 (జైస్వాల్ 173*, సాయి 87, వారికన్ 2/60)