గువహతి: బీడబ్ల్యూఎఫ్ జూనియర్ మిక్స్డ్ టీమ్ చాంపియన్‌షిప్స్‌లో భారత జట్టు కాంస్యం పతకం గెలుచుకుంది. గువహతి వేదికగా జరుగుతున్న ఈ టోర్నీ గ్రూప్ దశలో అజేయంగా నిలిచి క్వార్టర్స్‌లో పటిష్టమైన దక్షిణ కొరియాను చిత్తు చేసిన భారత్.. సెమీస్ పోరులో 0-2 (35-45, 21-45)తో ఇండోనేషియా చేతిలో ఓటమిపాలైంది. సెమీస్‌లో ఓడినా భారత్‌కు కాంస్యం దక్కింది. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో పతకం నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఆట విషయానికొస్తే.. మెన్స్ డబుల్స్‌లో భార్గవ్, విశ్వ ద్వయం 9-6తో ముబరోక్, ప్రమనొను ఓడించి భారత్‌కు ఆరంభంలోనే ఆధిక్యాన్ని అందించారు. తర్వాత ఉమెన్స్ సింగిల్స్‌లో ఉన్నతి హుడా ఆధిక్యాన్ని 18-16కు పెంచినా మిగిలిన షట్లర్లు వరుసగా విఫలమయ్యారు. రెండో సెట్లోనూ ఇండోనేషియా సంపూర్ణ ఆధిక్యం ప్రదర్శించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది.