‘పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో బీసీలకు ఎంతో న్యాయం జరిగింది. సంక్షేమ బడ్జెట్లో 70 శాతం బీసీలకే కేటాయించిండ్రు. కేసీఆర్ ఆనాడు కుల వృత్తులను బలోపేతం చేస్తుంటే కొంత మంది ఎగతాళి చేస్తూ మాట్లాడిండ్రు. ఇప్పుడు గత 15 నెలల నుంచి కుల వృత్తులు ఏ విధంగా కుదేలయ్యాయో చూస్తున్నాం. ఇప్పుడు ఒక్కరూ మాట్లాడరెందుకు?’
‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఏ ఒక్క సీటును కూడా బీసీ వర్గానికి ఇవ్వలేదు. కానీ ఇదే కామారెడ్డి గడ్డపై బీసీ డిక్లరేషన్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఆనాడే ప్రజలను వంచించింది.’
– ఎమ్మెల్సీ కవిత
నిజామాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/కామారెడ్డి : వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచింది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీయేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో బీసీలకు ఎంతో న్యాయం జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ పేరిట బీసీలను నమ్మించి మోసగించిందని మండిపడ్డారు. బీసీ డిక్లరేషన్‌ను నూరు శాతం అమలు చేసేదాకా రేవంత్ సర్కారును వెంటాడుతామని స్పష్టం చేశారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ ఆధ్వర్యంలో కామారెడ్డిలో బీసీ కుల సంఘాలతో శనివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత ప్రసంగించారు. బీసీలకు న్యాయం చేసే వరకూ ఉద్యమం కొనసాగిస్తామన్నారు.
బీసీ బంధు కవితక్క..
రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న బీసీ కులాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత చేస్తున్న బీసీ రిజర్వేషన్ పోరాటంపై ప్రశంసల జల్లు కురిపించారు. కవిత పోరాటంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో రెండు వేర్వేరు బిల్లులు పెట్టిందన్నారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కృషితోనే ఇదంతా జరిగిందన్నారు. బీసీల పక్షాన పోరాటం చేసిన ఎమ్మెల్సీ కవిత పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలుస్తుందని వ్యాఖ్యానించారు.
బీసీ పోరాటంపై కృతజ్ఞతగా ఓ వక్త విన్నపం మేరకు సభికులంతా లేచి నిలబడి చప్పట్లతో కవితకు కృతజ్ఞతలు తెలిపారు. కుల గణనలో బీసీల సంఖ్య తక్కువగా చూపెట్టినప్పటికీ బీసీ సంఘాలు, యునైటెడ్ ఫూలే ఫ్రంట్, తెలంగాణ జాగృతి వంటి సంస్థల ఒత్తిడి, ఉద్యమంతోనే బీసీ రిజర్వేషన్ అంశం కొలిక్కి వచ్చిందన్నారు.
కేసీఆర్ హయాంలో బీసీలకు జరిగిన మేలును పలువురు గుర్తు చేశారు. కుల వృత్తుల వారికి అందించిన ప్రోత్సాహాలను గొల్ల, కురమలు, గౌడ్, మత్స్యకార సామాజిక వర్గాలకు చెందిన వారు కొనియాడారు. శివశంకర్ ప్రారంభోపన్యాసం చేశారు. మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్, ప్రతినిధులు బాజిరెడ్డి జగన్, సుమిత్రానంద్, అయాచితం శ్రీధర్, నవీనాచారి, సంపత్‌గౌడ్, నరాల సుధాకర్, విజయేందర్, కాసాని వీరేశ్, భాస్కర్ యాదవ్, జుబేర్, నరేశ్, మారయ్య, సాంబారి మోహన్, కొట్టాల యాదగిరి, సురేందర్, వీరన్న, కుమారస్వామి, సాల్వాచారి, గోపి సదానందం, శ్రవణ్, మంజుల, బాజ లలిత, అశోక్ యాదవ్, బాలన్న, లింగం తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్‌తోనే బీసీలకు న్యాయం..
కేసీఆర్ హయాంలో బీసీలకు అన్ని రంగాల్లో న్యాయం దక్కిందని కవిత తెలిపారు. ఓయూకు తొలిసారి బీసీ బిడ్డను వీసీగా చేసింది కేసీఆరే అని, తెలుగు రాష్ర్టాల్లోనే మొదటిసారిగి బీసీని అడ్వకేట్ జనరల్‌గా పెట్టింది కేసీఆరే అని గుర్తుచేశారు. నాడు సబ్బండ వర్ణాలను కలుపుకుని పోయామని, అదే ఒరవడి కొనసాగాలని ఈరోజు కొట్లాడుతున్నామన్నారు. రాజకీయం, విద్య, ఉద్యోగపరంగా రిజర్వేషన్లు రావాలని, ఇందుకోసం మూడు బిల్లులు పెట్టాలని కవిత డిమాండ్ చేశారు.
ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఏమైంది?
కేసీఆర్ నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 52 శాతం అని తేలిందని కవిత తెలిపారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో బీసీల జనాభాను తగ్గించి ఓసీల జనాభాను పెంచారని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో కేవలం రాజకీయ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని తెలిపారు. కానీ తమ పోరాటం వల్ల దిగివచ్చిన ప్రభుత్వం విద్య, ఉద్యోగ రంగాల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ చట్టాలు చేసిందన్నారు.
ఎంబీసీ కులాలకు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇంత వరకు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. రాష్ట్ర సభలు ఆమోదించిన బీసీ బిల్లుల స్థితిపై ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లులు గవర్నర్ వద్ద ఉన్నాయా? లేక రాష్ట్రపతికి పంపించారా? చెప్పాలన్నారు. తెలంగాణ చట్ట సభలు పాస్ చేసిన బీసీ బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలని కవిత డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గ్రామాల వారీగా కులాల వారీగా జనాభా లెక్కలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
కవిత పోరాటం అభినందనీయం..
బీసీ సమాజం అన్యాయానికి గురవుతున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేస్తున్న పోరాటం అభినందనీయం. 33 జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి మన హక్కుల కోసం కోట్లాడుతున్న ఎమ్మెల్సీ కవితకు ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమ సమయంలో, బతుకమ్మ కనుమరుగవుతున్న రోజుల్లో ముందుండి పోరాడారు. ఇప్పుడు బీసీల కోసం చేస్తున్న మీ పోరాటం వృథా కాదు.
– జాజాల సురేందర్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే
మా గళానికి బలాన్ని ఇస్తున్నారు
బీసీ కులాల తరుపున కవిత మా గళానికి బలాన్ని ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ అనేక ఉద్యమాలను చేపట్టిన ఘనత కవితక్కది. క్షేత్ర స్థాయి నుంచి కష్టపడే వారు మాత్రమే ఈ బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లగలరు. బీసీల కోసం కొట్లాడుతున్న బలహీన
వర్గాలన్నీ మీ వెంటే ఉన్నాయి.
– బాజిరెడ్డి జగన్, మాజీ జడ్పీటీసీ, ధర్పల్లి
అబద్ధాలతో అధికారంలోకి..
అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కామారెడ్డి వేదికగా బీసీలకు అనేక హామీలు ఇచ్చింది. వాటిని అమలు చేయలేక చేతులెత్తేసింది. 42 శాతం స్థానిక సంస్థల్లో అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ మాట ఇచ్చింది. బీసీ జన గణన ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలి.
– సుమిత్రానంద్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు
బీసీల అభ్యున్నతి కోసమే ఉద్యమం
గతంలో బీసీల కోసం పోరాడిన నాయకుడు ఎవరు లేరు. కానీ ఎమ్మెల్సీ కవిత ఒక్కరే బీసీల పక్షాన కొట్లాడుతున్నారు. మండలిలో బీసీల హక్కుల కోసం ప్రభుత్వంపై పోరాటం చేశారు. బీసీలు బాగు పడాలని, బీసీల అభ్యున్నతి కోసం ఆమె చేస్తున్న ఉద్యమానికి సబ్బండ వర్గాలు అండగా ఉంటాయి.
– సంపత్ గౌడ్, జాగృతి నాయకుడు
బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం..
బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటాన్ని ముందుగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నాం. 70 కుల సంఘాలతో ఎమ్మెల్సీ కవిత చర్చించారు. వారందరినీ ఏకతాటిపైకి తెచ్చి ముందుకు నడిపించిన వ్యక్తి కవిత. ఆమె పోరాటానికి బీసీల పూర్తి మద్దతు ఉంటుంది.
– శివశంకర్, యునైటెడ్ ఫూలే ఫ్రంట్ కో-కన్వీనర్