జనగామ : ఉమ్మడి వరంగల్(Warangal ) జిల్లాకు సంబంధించి విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు సాధించకుండా ఏ ముఖం పెట్టుకొని వరంగల్‌లో నిరుద్యోగ మార్చ్ (Unemployment March) చేస్తారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి(Kadiam Srihari) బీజేపీ నాయకులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. జనగామ జిల్లాలో లింగాలఘనపురం మండలం నెల్లుట్లలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆయన మాట్లాడుతూ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణకు కొత్త ప్రాజెక్టులు ఇవ్వాలన్న ఆలోచన చేయని బీజేపీ తెలంగాణలో అవసరమా? అని అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకునే పార్టీని బీజేపీని ప్రజలు బొందపెట్టాలని పిలుపునిచ్చారు. టీఎస్పీఎస్, టెన్త్‌క్లాస్ పేపర్ లీకేజీ(Paper leak)లో ప్రధాన నిందితులందరూ బీజేపీ నాయకులు(Bjp leaders), కార్యకర్తలే ఉన్నారని ఆరోపించారు.
తెలంగాణలో పండిన వరి ధాన్యం కొనలేమని కేంద్రంలోని బీజేపీ సర్కార్ చేతులేత్తేస్తే తామే కొంటామని భరోసా కల్పించిన మహానుభావుడు ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) అని అన్నారు. మోదీకి తెలంగాణపై వివక్ష ఉందని ఆరోపించారు. తెలంగాణకు ఫలానా పనిచేశామని చెప్పడానికి మీ వద్ద ఏమైనా ఉందా? అంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను ప్రశ్నించారు. ఉంటే బహిరంగంగా ప్రకటించి ప్రజల మన్నలు పొందాలని సూచించారు.
‘ తెలంగాణలో కేసీఆర్ సర్కార్ లక్షా 30వేల ఉద్యోగాలు భర్తీ చేసింది. ఇంకా 82వేల ఖాళీలకు కొత్త నోఫికేషన్లు ఇచ్చాం. భర్తీ ప్రక్రియ సజావుగా జరిగితే తెలంగాణలో పుట్టగతులుండవని లీకేజీల పర్వానికి బీజేపీ తెరలేపిందని’ మండిపడ్డారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ, ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని పేర్కొన్నారు. తెలంగాణపై బీజైపీకి ప్రేమ ఉంటే విభజన చట్టంలోని హామీ నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్న అని అన్నారు.