– పాత కాంగ్రెస్ నాయకులను పక్కన పెట్టిన వైనం
– తన ఇష్టానుసారం స్థానిక ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు
– రెండు సంవత్సరాలు ఓపిక పట్టినం ఇక చాలు
కట్టంగూర్, నవంబర్ 27 : ఎమ్మెల్యే వేముల వీరేశం నియంతలా వ్యవహరిస్తూ గ్రామ, మండల, నియోజకవర్గ నాయకుల అభిప్రాయ సేకరణ లేకుండా, పాత కాంగ్రెస్ నాయకులను పక్కకు పెట్టి 22 గ్రామ పంచాయతీలకు తన సొంత సర్పంచ్ అభ్యర్థులను ప్రకటించుకున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ జడ్పీటీసీ సుంకరబోయిన నర్సింహ్మ తెలిపారు. పాత కాంగ్రెస్ నాయకులకు టికెట్లు కేటాయించకపోవడంతో గురువారం వైవీఆర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య నాయకులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తమకు గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల టికెట్ల కేటాయింపులో ఎమ్మెల్యే వేముల వీరేశం, అతడి వర్గీయుల నుంచి తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. పార్టీలు మారకుండా 40 సంత్సరాలు కాంగ్రెస్ పార్టీనే నమ్ముకుని పని చేస్తున్నా టికెట్ల కేటాయింపులో తీవ్ర అన్యాయం జరిగిందని అవేదన వ్యక్తం చేశాడు. ఇతర పార్టీల నుండి కాంగ్రెస్లోకి వచ్చిన వారు కట్టంగూర్పై పెత్తనం చేయడం ఎంటని ఆయన ప్రశ్నించారు.
పాత కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. అద్దెకు వచ్చిన నాయకులను నమ్మవద్దని మండలంలోని 22 గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులకు కాంగ్రెస్ పార్టీ తరుపున నామినేషన్లు వేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. రెండు సంవత్సరాలు కాళ్లు, చేతులు కట్టేసినట్లు అయినా ఓపికపట్టి వాళ్ల వెంట తిరిగినా ఫలితం లేదు. ఇక వాళ్లకు తనకు సంబంధం లేదన్నారు. పాత కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. పాత కాంగ్రెస్ నాయకులను సర్పంచ్, వార్డు సభ్యులను ముందుండి గెలిపిస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చెరుకు యాదగిరి, ముక్కాముల శేఖర్, మేడి ఇద్దయ్య, గట్టిగొర్ల సత్తయ్య, మేడి విజయ్, మేడిశ్వరమ్మ, చెరుకు రామన్న, కాపుగంటి గోపి, ఊటుకూరు శ్రీను పాల్గొన్నారు.