శివ్వంపేట, డిసెంబర్ 17 : స్థానిక సంస్థల ఎన్నికల(Panchayath elections) నేపథ్యంలో కాంగ్రెస్(Congress) నాయకులకు అనుకూలంగా పోలీసులు వ్యవహరిస్తూ బీఆర్ఎస్ మద్దతుదారుల సర్పంచ్ అభ్యర్థులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేశారని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. బుధవారం స్థానిక ఎన్నికల సందర్భంగా స్వగ్రామమైన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు పోలీసుల అండతో దౌర్జన్యాలకు పాల్పడుతూ ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలలో ఏ ఒక్క అభివృద్ధి పని చేయకపోగా.. గ్రామాల్లో ఓటర్లను మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని తమకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు నిలిపివేస్తామని కాంగ్రెస్ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమైన చర్యగా ఆమె విమర్శించారు. పోలీసులు గత రెండు మూడు రోజులుగా వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, మండలంలోని బిజిలిపూర్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త ఇంట్లోకి చొరబడి కొట్టడం అమానుషమని అన్నారు.
అలాగే కొల్చారం మండలం రంగంపేట గ్రామంలో బీఆర్ఎస్ మాజీ జడ్పిటిసి ఇంట్లో లిక్కర్ అమ్ముతున్నారంటూ హడావుడి చేయడం రాజకీయ కక్షతో చేసిన చర్యగా ఆరోపించారు. నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో నిన్న రాత్రి పోలీసుల పహారాలోనే డబ్బులు తీసుకువచ్చి లైట్లు ఆపేసి కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంపిణీ చేశారని ఎమ్మెల్యే తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి అక్రమాలకు పోలీసులు మౌనసాక్షిగా ఉండటం ప్రజాస్వామ్యానికి మచ్చగా పేర్కొన్నారు.
ఈ ఘటనలపై వెంటనే ఉన్నతాధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి రోడ్లెక్కి ఉద్యమిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్ర గౌడ్, బీఆర్ఎస్ నాయకులు సంతోష్ రెడ్డి, కుంట లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.